Share News

ERC: గృహ విద్యుత్‌ చార్జీలు పెరగలే!

ABN , Publish Date - Oct 29 , 2024 | 05:12 AM

సామాన్యులకు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) శుభవార్త వినిపించింది. హైటెన్షన్‌(హెచ్‌టీ) వర్గాలకు కరెంట్‌ చార్జీలను హేతుబద్ధీకరించాలని, వివిధ వర్గాలకు స్థిరచార్జీలు పెంచాలని.

ERC: గృహ విద్యుత్‌ చార్జీలు పెరగలే!

  • కనీస నెలవారీ చార్జీల విధానం రద్దు

  • ‘హెచ్‌టీ’లో హేతుబద్ధీకరణకు బ్రేక్‌

  • పంపిణీ సంస్థలకు ఈఆర్‌సీ షాక్‌

  • 11,499 కోట్లుగా ప్రభుత్వ సబ్సిడీ

  • ఈవీ కేంద్రాలకు స్థిర చార్జీల్లేవు

  • నిర్ణయాలు 1 నుంచి అమల్లోకి..

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సామాన్యులకు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) శుభవార్త వినిపించింది. హైటెన్షన్‌(హెచ్‌టీ) వర్గాలకు కరెంట్‌ చార్జీలను హేతుబద్ధీకరించాలని, వివిధ వర్గాలకు స్థిరచార్జీలు పెంచాలని.. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) చేసిన ప్రతిపాదనలను తిరస్కరించింది. కనీస నెలవారీ చార్జీల విధానాన్ని తొలగించింది. 800 యూనిట్లకు పైబడి విద్యుత్‌ వినియోగించేవారికి మాత్రం స్థిరచార్జీలను ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50కి పెంచడానికి అనుమతిచ్చింది. ఈఆర్‌సీ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను డిస్కమ్‌లు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌)పై ఈ నెల 23, 24 తేదీల్లో ఈఆర్‌సీ బహిరంగ విచారణ జరిపింది. దాంతోపాటు మొత్తం 8 పిటిషన్లపై సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం..


  • ఎల్‌టీ-2 (నాన్‌ డొమెస్టిక్‌/కమర్షియల్‌)లో 50 యూనిట్ల దాకా వినియోగించే వారి నుంచి రూ.60 స్థిరచార్జీగా వసూలు చేస్తుండగా దాన్ని రూ.30కి కుదించారు.

  • ఎల్‌టీ-3 (ఇండస్ట్రీ)లో పుట్టగొడుగులు, కుందేలు పెంపకం ఫామ్‌ల కనెక్టెడ్‌ లోడ్‌ సామర్థ్యాన్ని 10 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీకి పెంచారు. గొర్రెల పెంపకం యూనిట్లకు 15 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీకి పెంచారు.

  • ఎల్‌టీ-5 (అగ్రికల్చర్‌ ) కేటగిరిలో నర్సరీలకు లోడ్‌ను కూడా 15 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి పెంచారు.

  • ఈవీ చార్జింగ్‌ కేంద్రాలకు కిలోవాట్‌కు రూ.50 చొప్పున వసూలు చేస్తున్న స్థిరచార్జీని తొలగించాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనను ఈఆర్‌సీ ఆమోదించింది.

  • డిమాండ్‌ లేని సమయంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల దాకా విద్యుత్‌ను వినియోగించే వర్గాలకు.. ప్రధానంగా హెచ్‌టీ(హైటెన్షన్‌) వర్గాలకు యూనిట్‌కు రూ.1 చొప్పున ఇస్తున్న రాయుతీని రూపాయిన్నరకు పెంచారు.

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ కొనుగోళ్లకు రూ.36,934.46 కోట్లు ఖర్చవగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.42,702.21 కోట్లు అవుతాయని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కానీ, ఈఆర్‌సీ రూ.40,714.23 కోట్లకు ఆమోదించింది.

  • 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ అవసరాలు రూ.57,728.90 కోట్లుగా డిస్కమ్‌లు క్లెయిమ్‌ చేయగా.. రూ.54,183.28 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది.

  • రెవెన్యూలోటును రూ.13,022 కోట్లుగా చూపించగా... రూ.11,156.40 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదించింది.

  • డిస్కమ్‌లకు రూ.11,499.52 కోట్లను సబ్సిడీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఉత్తర డిస్కమ్‌(వరంగల్‌)కు రూ.7,141.35 కోట్లు, దక్షిణ డిస్కమ్‌(హైదరాబాద్‌)కు రూ.4015.06 కోట్లు, సిరిసిల్ల సహకార విద్యుత్‌ సంస్థ(సె్‌స)కు రూ.343.11 కోట్లు విడుదల కానున్నాయి. కాగా.. రూ.11,499 కోట్ల రాయితీలో వ్యవసాయ రంగం వాటా రూ.9800.07 కోట్లు ఉండగా... డొమెస్టిక్‌ వాటా రూ.1699.45 కోట్లుగా ఉంది.


  • హెచ్‌టీ వర్గాలకు ఊరట

హెచ్‌టీ వర్గాలకు ఈఆర్‌సీ భారీగా ఊరట కల్పించింది. హెచ్‌టీలోని అన్ని కేటగిరీలకూ చార్జీలను హేతుబద్ధీకరించాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. హెచ్‌టీ 11 కేవీ యూనిట్‌కు రూ.7.65 వసూలు చేస్తున్నట్టే.. 33 కేవీ, 132 కేవీలో కూడా రూ.7.65 వసూలు చేయాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఈ చార్జీలను ఆమోదిస్తే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దాంతో పాత చార్జీలను యథాతథంగా 33 కేవీకి రూ.7.15, 132 పై కేవీకి రూ.6.65 కొనసాగిస్తూ ఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. ఈ వర్గాలకు స్థిర చార్జీలను కిలోవాట్‌కు రూ.475 నుంచి రూ.500కు పెంచుతూ నిర్ణయం వెలువరించింది.


  • సకాలంలో పిటిషన్లు వేయండి..

డిస్కమ్‌లకు ఈఆర్‌సీ పలు సూచనలు చేసింది. సకాలంలో పిటిషన్లు వేయాలని కోరింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలను రాబట్టుకోవాలని సూచించింది. సకాలంలో పిటిషన్లు వేయని కారణంగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(పెట్టిన పెట్టుబడిపై రాబడి)పై కోత విధించింది. తెలంగాణ జెన్‌కోకు రూ.390 కోట్ల మేర, ట్రాన్స్‌కో, స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎ్‌సఎల్‌డీసీ)కి రూ.119 కోట్లు, డిస్కమ్‌ల వీలింగ్‌ బిజినె్‌సకు రూ.62 కోట్ల, రిటైల్‌ బిజినె్‌సకు రూ.7 కోట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Oct 29 , 2024 | 05:12 AM