Share News

Sricilla : పోలీసులకు భయపడి..ఇసుక ట్రాక్టర్‌ నుంచి దూకేసి డ్రైవర్‌ పరారీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:30 AM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాను నడుపుతున్న ట్రాక్టర్‌ నుంచి అకస్మాత్తుగా దూకి పరారయ్యాడు.

Sricilla : పోలీసులకు భయపడి..ఇసుక ట్రాక్టర్‌ నుంచి దూకేసి డ్రైవర్‌ పరారీ

  • చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌, ఓ కానిస్టేబుల్‌కు గాయాలు

ముస్తాబాద్‌, జూన్‌ 25 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాను నడుపుతున్న ట్రాక్టర్‌ నుంచి అకస్మాత్తుగా దూకి పరారయ్యాడు. దీంతో ఆ ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లి మునిగిపోగా, ఆ ట్రాక్టర్‌పై ఉన్న ఓ కానిస్టేబుల్‌ అదృష్టవసాత్తు గాయాలతో బయటపడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌ మండలంలో నామాపూర్‌ మానేరు వాగు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోమవారం రాత్రి దాడి చేసిన పోలీసులు నామాపూర్‌ శివారులో ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టర్‌పై ఒక్కో కానిస్టేబుల్‌ కూర్చోని వాటిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇందులో గురుబాబు అనే వ్యక్తి నడుపుతున్న ట్రాక్టర్‌పైకి సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌ ఎక్కాడు. మార్గమధ్యలో గురుబాబు ట్రాక్టర్‌ నుంచి అకస్మాత్తుగా దూకేసి పరారయ్యాడు. దీంతో ట్రాక్టర్‌ పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లగా, ట్రాక్టర్‌ నుంచి దూకిన కానిస్టేబుల్‌ సత్యనారాయణ రాళ్లపై పడి గాయపడ్డాడు. అయితే, ఐదో ట్రాక్టర్‌ స్టేషన్‌కు చేరకపోవడంతో వెనక్కి వెళ్లిన పోలీసులకు మేళ్ల చెరువు కట్ట పక్కన రాళ్లపై పడి ఉన్న కానిస్టేబుల్‌ సత్యనారాయణను గుర్తించి ఏం జరిగిందో తెలుసుకుని ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, గురుబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jun 26 , 2024 | 09:39 AM