Share News

సెస్‌లు, సర్‌చార్జీల వివాదం.. కేంద్రం-రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:48 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సెస్‌లు, సర్‌చార్జీల వివాదాన్ని ఆయా సర్కారులే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, అది తమ పరిధిలో లేదని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అర్వింద్‌ పనగారియా స్పష్టం చేశారు.

సెస్‌లు, సర్‌చార్జీల వివాదం.. కేంద్రం-రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి

  • పన్నుల వాటాపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తున్నాం

  • తెలంగాణలో పట్టణాభివృద్ధి బాగుంది

  • ఆర్థిక సంఘం చైర్మన్‌ పనగారియా

హైదరాబాద్‌/భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న సెస్‌లు, సర్‌చార్జీల వివాదాన్ని ఆయా సర్కారులే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, అది తమ పరిధిలో లేదని 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అర్వింద్‌ పనగారియా స్పష్టం చేశారు. దీని పరిష్కారానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్థిక సంఘం సభ్యులు మనోజ్‌ పాండా, అజయ్‌ నారాయణ్‌ ఝా, అన్నీ జార్జ్‌ మాథ్యూ, సౌమ్యకంటి ఘోష్‌లతో కలిసి మంగళవారం పనగారియా ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పన్నుల వాటాలో 41 శాతాన్ని రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్రం.. సెస్‌, సర్‌చార్జీలు అంటూ పేర్లు మార్చి వసూలు చేసిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటోందని.. దీని వల్ల రాష్ట్రాలకు పన్నుల వాటా 41శాతం కంటే చాలా తక్కువ వస్తోందని.. దీని పరిష్కారానికి ఆర్థిక సంఘం ఏమైనా సిఫారసు చేస్తుందా..? అని ప్రశ్నించగా.. అర్వింద్‌ పైవిధంగా స్పందించారు. తమ ఆర్థిక సంఘం ప్రధానంగా మూడు అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తోందని తెలిపారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా నిర్ధారణ, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు, ప్రకృతి విపత్తుల నిర్వహణకు నిధుల వాటాలను తాము సిఫారసు చేయాల్సి ఉంటుందని, అందుకే రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, కర్ణాటక, తెలంగాణలో పర్యటించామని.. మిగతా రాష్ట్రాల్లోనూ పర్యటిస్తామని వివరించారు. అన్ని రాష్ట్రాల వినతులను స్వీకరిస్తున్నామని తెలిపారు. పలు రాష్ట్రాలు పన్నుల వాటా నిధులు తగ్గుతున్నాయని చెబుతున్నాయని.. తెలంగాణ, కర్ణాటక ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని.. జీఎ్‌సడీపీ ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించాలని తెలంగాణ కోరిందని వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధితో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు బాగున్నాయని ప్రశంసించారు. తాము చేసే సిఫారసుల ఆధారంగా నిర్ధారణ అయ్యే పన్నుల వాటా 2026 నుంచి ఐదేళ్లు అమలవుతుందని అర్వింద్‌ వివరించారు.


  • ఎస్‌హెచ్‌జీల పనితీరు భేష్‌..

రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్‌ నారాయణ ఝూ అన్నారు. ఆర్థిక సంఘం సభ్యులతో కలిసి మంగళవారం ఆయన భువనగిరి మండలంలోని అనంతారం గ్రామాన్ని సందర్శించారు. పల్లె దవాఖానాను పరిశీలించి, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌ నారాయణ ఝా మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి వచ్చినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని, 16వ ఆర్థిక సంఘం నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 04:48 AM