Share News

Congress Government: బీసీ లెక్కల కోసం.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే!

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:53 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగాను బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసేందుకు.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై కసరత్తు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి.. బీసీల లెక్కలు తేల్చాక..

Congress Government: బీసీ లెక్కల కోసం.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే!

ఆ తర్వాతే బీసీ రిజర్వేషన్ల ఖరారు

ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్వేపై త్వరలో తుది నిర్ణయం

కులగణన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందునే!

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగాను బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసేందుకు.. ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై కసరత్తు చేయాలని భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి.. బీసీల లెక్కలు తేల్చాక.. అందుకనుగుణంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, కులగణనకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడం, మరోవైపు స్థానిక ఎన్నికలనూ రాజ్యాంగబద్ధంగా ఐదేళ్లకోసారి నిర్వహించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఓటర్ల జాబితా ఆధారిత సర్వే వైపు మొగ్గు చూపిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితాను తీసుకుని, ఆ జాబితాతో సిబ్బందిని గ్రామపంచాయతీల వారీగా ఇంటింటికీ పంపి.. కులాలవారీ లెక్కలు సేకరిస్తారు.

గ్రామాల వారీగా ఏ కులం జనాభా ఎంత ఉందో తేలుస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని రెండు మూడు నెలల్లోనే పూర్తిచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. అయితే ప్రస్తుతానికి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రకారం కులాల లెక్కలు తీసినా.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీమేరకు ‘‘సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే’’ను విడిగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం తేల్చాల్సిన కులాల లెక్కల్లో మూడు అంశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. డెడికెటేడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామం వారీగా కులాల లెక్కలు తీయడం, అన్ని వర్గాలకు కలిపి 50 శాతానికి మించకుండా రిజర్వేషన్‌ ఉండడం అన్నవి ఈ మూడు అంశాలు. అయితే ఓటర్ల జాబితా ప్రకారం ముందుకెళ్లినా ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


  • బీసీల రిజర్వేషన్‌ ఎంత?

ఓటర్ల జాబితా ప్రకారం కులాల లెక్కల తీస్తే.. అన్ని కులాలతోపాటు బీసీల లెక్కలూ తేలుతాయి. దానిని బట్టి వారికి ఎంతశాతం రిజర్వేషన్‌ కల్పించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత బీఆర్‌ఎస్‌ సర్కారు 2018లో పంచాయతీరాజ్‌ చట్టంలో పలు సవరణలు చేసింది. అందులో.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూసే క్రమంలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలు నిర్వహించింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు వాటిని విచారించిన సమయంలో 2024లో జరిగే స్థానిక ఎన్నికల్లో సుప్రీం మార్గదర్శకాలను అమలు చేస్తామని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయస్థానానికి చెప్పింది. దీంతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం రాష్ట్రంలోని బీసీల జనాభాను తేల్చి వారి శాతాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది.

  • రిజర్వేషన్ల అంశంతో ఆలస్యంగా ఎన్నికలు..

నిజానికి సర్పంచ్‌ల పదవీకాలం ఈ జనవరిలోనే ముగిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం జూలై మొదటివారంతో ముగియనుంది. దీంతో ఈలోపే ఎన్నికలు నిర్వహించి కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. కానీ, రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ఎన్నికలు సమయానుకూలంగా జరగడంలేదు. అయితే 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. బీసీ కార్పొరేషన్‌ ద్వారా సేకరించిన గణాంకాలు, 2000వ సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన మల్టీపర్పస్‌ హౌస్‌హోల్డ్‌ సర్వే (ఎంపీహెచ్‌ఎ్‌స) ప్రకారం..

అప్పటి పరిస్థితులు, జనాభా ఆధారంగా బీసీలకు అవకాశం కల్పిస్తూ వచ్చారు. ఈ గణాంకాలు, జనాభా పెరుగుదల ఆధారంగా ఆ తరువాత కూడా రిజర్వేషన్లు అమలుచేస్తూ వచ్చారు. 2004లో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, అమల్లోకి తీసుకువచ్చారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎవరికి వారు రిజర్వేషన్లను పెంచుతూ పోవడంతో..

అసలు బీసీలకు రిజర్వేషన్‌ ఎంత అన్నది తేల్చాలనే వాదనలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.


కానీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ వర్తిస్తుండడడంతో బీసీలకు రిజర్వేషన్‌ శాతం తగ్గిపోయింది. దీంతో తమకు కూడా జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లను వర్తించాలనే డిమాండ్‌ను బీసీలు తెరపైకి తెచ్చారు.

  • ఓటర్ల జాబితాతో సర్వే ఇలా..

స్థానిక ఎన్నికలను కొత్త ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించాలంటే.. మొదట పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి సవరించిన ఓటర్ల జాబితాను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాబితా ఆధారంగా గ్రామ, వార్డు, మండలాల వారీగా ఉన్న కులాల వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో ఇతర కులాలతోపాటు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు ఎంతమేర రాజకీయ ప్రాతినిధ్యం లభించిందనే విషయంతోపాటు రాజకీయంగా ఎంతమేర వెనుకబాటుతనానికి గురయ్యారనే వివరాలను కూడా సేకరిస్తారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి బీసీ కమిషన్‌కు సమర్పిస్తారు. బీసీ కమిషన్‌ వాటిని పరిశీలించి బీసీలకు ఎంతమేర రిజర్వేషన్‌ కల్పించాలనే దానిపై ప్రభుత్వానికి సూచన చేస్తుంది. అయితే.. కమిషన్‌ ఎంత శాతాన్ని సూచించినా.. ప్రభుత్వం మాత్రం 50శాతం రిజర్వేషన్‌ నిబంధనకు లోబడే నడచుకోవాల్సి ఉంటుంది.

  • రిజర్వేషన్లు మారే అవకాశం..

ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించబోయే ఎన్నికల్లో ఈసారి గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లు మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన సవరణల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి మాత్రమే రిజర్వేషన్లు మారుతాయి. కానీ, గత ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్‌ల విషయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన వకుళాభరణం కృష్ణమోహన్‌ నేతృత్వంలోని పూర్తిస్థాయి డెడికేటెడ్‌ కమిషన్‌ రిజర్వేషన్లకు సంబంధించి కులసంఘాలు, నిపుణులు, ప్రొఫెసర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.

Updated Date - Jun 15 , 2024 | 02:53 AM