Godavari Express: గోల్డెన్.. గోదావరి.. సూపర్‌ఫాస్ట్ రైలుకు 50 ఏళ్లు పూర్తి
ABN , Publish Date - Feb 02 , 2024 | 11:31 AM
తెలుగు రాష్ర్టాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Godavari Superfast Express)కు గురువారంతో 50 ఏళ్లు నిండాయి.
- నాంపల్లిలో సంబురాలు జరుపుకున్న ఉద్యోగులు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Godavari Superfast Express)కు గురువారంతో 50 ఏళ్లు నిండాయి. ఇటు సికింద్రాబాద్‌లో, అటు విశాఖపట్నం(Visakhapatnam)లో సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయాన్నే గమ్యస్థానానికి చేర్చుతోంది. కోచ్‌ల్లో శుభ్రత, ఆహార నాణ్యత.. ఇలా అన్నింటిలో ప్రత్యేకంగా నిలిచిన ఈ రైలు గురువారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకొంది. ఈ మేరకు నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ఫారం-6 పై గోదావరి ఎక్స్‌ప్రెస్ వద్ద ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. అప్పట్లో గోదావరిని ఆంగ్లో ఇండియన్స్ నడిపేవారని, మొదట్లో బొగ్గుతో నడిచేదని, 10కోచ్‌లు మాత్రమే ఉండేవని రిటైర్డ్ ఇంజన్ డ్రైవర్ సీతయ్య తెలిపారు. గోదావరి రైలుకు 50 ఏళ్లయినా ఆదరణ తగ్గలేదని రైల్వే మాజీ అధికారి ఆగంబరరెడ్డి చెప్పుకొచ్చారు.