Godavari Water Level: భద్రాద్రి వద్ద ఉధృతంగా గోదావరి
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:32 AM
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం 45.5అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
45.5 అడుగులకు చేరిన నీటి మట్టం
శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం 45.5అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీకి 5.29 లక్షల క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీకి 8.19లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆయా బ్యారేజీల్లోని గేట్లన్నీ ఎత్తి.. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు పంపిస్తున్నారు. ఇక, కృష్ణాబేసిన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద స్వల్పంగా పెరిగింది.
జూరాల ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆరు గేట్లు ఎత్తి 41,742, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,624 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,22,062క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. గేట్ల ద్వారా 27,937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 67,824 క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 587.70 అడుగుల మేర నీరు ఉంది. విద్యుదుత్పత్తితోపాటు కాలువల ద్వారా మొత్తం 40,810 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.