Share News

Job Calender: జాబ్‌ క్యాలెండర్‌ రెండు వారాల్లో!

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:36 AM

నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

Job Calender: జాబ్‌ క్యాలెండర్‌ రెండు వారాల్లో!

  • షెడ్యూలు ప్రకారం పరీక్షలు.. పకడ్బందీగా కొలువుల భర్తీ

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో.. అధికారులు జాబ్‌ క్యాలెండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారని, రెండు వారాల్లో విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

(టీజీపీఎస్సీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఇతర నియామక బోర్డులకు సంబంధించిన షెడ్యూళ్లతో.. జాబ్‌ క్యాలెండర్‌ విడుదలయ్యాక.. అధికారులు ఆ వివరాలను యూపీఎస్సీ, జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీయే), ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, బ్యాంకింగ్‌ వంటి ఇతర పోటీ పరీక్షల బోర్డులకు, రాష్ట్రీయ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల.. ఉద్యోగార్థులకు టీజీపీఎస్సీ షెడ్యూల్‌ సమయంలో.. ఇతర పరీక్షల అడ్డంకులను తొలగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర జాబ్‌ క్యాలెండర్‌ కూడా.. యూపీఎస్సీ వంటి సంస్థల షెడ్యూల్‌లను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే అక్టోబరులో గ్రూప్‌-1 మెయిన్స్‌ తేదీలను ప్రకటించారు. అదేవిధంగా గ్రూప్‌-2 పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న నోటిఫికేషన్లను మినహాయించి.. పకడ్బందీగా జాబ్‌ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది.


నిరుద్యోగులకు భరోసాగా..

బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్లక్ష్యానికి గురైందని.. ఆ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలతో వివాదాలు కోర్టులకూ చేరాయని కాంగ్రెస్‌ నేతలు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో.. నిరుద్యోగుల్లో అపనమ్మకం నెలకొంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ సర్కారు ఆ అపనమ్మకాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు టీజీపీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి, కొత్త పాలక మండలిని నియమించింది.

పరీక్షల నిర్వహణను యూపీఎస్సీ తరహాలో చేపట్టేలా కట్టుదిట్టమైన విధానాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే..! ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ పరీక్షలపై కోర్టు వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌(2.0) రద్దుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకుంది.


పకడ్బందీగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ఇటీవలే ప్రాథమిక కీ విడుదలవ్వగా.. త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి. ఉద్యోగాల నియామకాల విషయంలో గతంలో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్ల విషయంలో కోర్టులు పలు తీర్పులనిచ్చాయి. ఆయా తీర్పులకు అనుగుణంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించింది.


దీని ప్రకారమే టీజీపీఎస్సీ, మెడికల్‌ బోర్డు, పోలీస్‌, గురుకుల బోర్డుల ద్వారా నిర్వహించిన పలు పోస్టులకు సంబంధించి.. అధికారంలోకి వచ్చిన మొదటి వందరోజుల్లోనే 28,942మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ కూడా నియామకాల విషయంలో వేగాన్ని పెంచింది. గతంలో పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌-4 ఫలితాలను విడుదల చేసింది.

ఈ పోస్టులకు ప్రస్తుతం సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. 1,540 ఏఈఈ పోస్టులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. వ్యవసాయ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఎంపికైన జాబితా విడుదలైంది. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల పోస్టుల పరీక్షలు పూర్తవ్వగా.. డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో) పరీక్షలు గత నెల 30న ప్రారంభమయ్యాయి. టెట్‌ పూర్తి చేసి. 11,062 పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది.

Updated Date - Jul 02 , 2024 | 04:36 AM