Share News

Google: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం

ABN , Publish Date - Dec 04 , 2024 | 05:05 PM

రేవంత్ రెడ్డి సర్కార్ జాక్ పాట్ కొట్టింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ మాత్రం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది.

Google: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 04: తెలంగాణలో భారీ పెట్టుబడులకు గూగుల్ కంపెనీ సిద్ధమైంది. అందులోభాగంగా తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ముందుకు వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ సారధ్యంలో కంపెనీ ప్రతినిధి బృందం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా గూగుల్ ప్రతినిధి బృందంతో వారు కీలక అంశాలను చర్చించారు. అనంతరం ఒప్పందం చేసుకున్నారు.

Also Read: ఆ విషయం.. మా హోం మినిస్టర్ భువనేశ్వరి చూసుకుంటారు


ప్రపంచంలో మేటి ఐటీ..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఈ సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ మహానగరం ప్రపంచంలో మేటీ ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత


ప్రపంచంలోనే ఐదు టెక్ కంపెనీలు..

గూగుల్ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన ఐదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.


ప్రపంచంలోనే ఐదవది..

హైదరాబాద్ వేదికగా స్థాపిస్తున్న ఈ సెంటర్.. ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్‌లో.. టోక్యో అనంతరం ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే కావడం గమనార్హం. అధునాతన భద్రతతోపాటు ఆన్‌లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది. అంటే.. ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ అని చెప్పవచ్చు.


ప్రపంచంనే అతి పెద్ద కార్యాలయం..

అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేయనుందని వివరిస్తున్నారు. ఇప్పటికీ గూగుల సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని గూగుల్.. హైదరాబాద్‌లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


పలు రాష్ట్రాలు పోటి..

ఇక ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌ జరిగింది. ఈ కాన్‌క్లేవ్ వేదికగా సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో నాటి నుంచి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని.. గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ గూగుల్ సంస్థ మాత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.


ఇటీవల యూఎస్‌లో పర్యటించిన సీఎం

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో హైదరాబాద్‌ వేదికగా ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించింది. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా వేల సంఖలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

For Telangana News And Telugu News

Updated Date - Dec 04 , 2024 | 05:12 PM