Share News

Surayapet: అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:32 AM

అభివృద్ధి ఫలాలు సమాజంలోని అందరికీ అందాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.

Surayapet: అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి

  • సూర్యాపేటలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

  • ధాన్యం కొనుగోలుకు 20వేల కోట్లు: ఉత్తమ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి ఫలాలు సమాజంలోని అందరికీ అందాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖీలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ అధ్యక్షత వహించారు. గవర్నర్‌ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనతను 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమన్నారు.


జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని కొనియడారు. అభివృద్ధి మహిళా సాధికారతపై ఆధారపడి ఉందని, వారి చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక సాధికారిత వస్తుందన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో చదువుతో పాటు చేతి వృత్తులకు సంబంధించిన చిన్నపాటి వస్తువుల తయారీపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వెచ్చించనుందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం రూ.28వేలకోట్లు కేటాయించిందన్నారు. ఐదేళ్లలో 30 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 03:32 AM