Share News

Hyderabad: ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యే: హరీశ్‌

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:16 AM

దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు.

Hyderabad: ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యే: హరీశ్‌

తిరుమలగిరి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు. పెండింగు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచ్‌లు ‘ఛలో హైదరాబాద్‌ యాత్ర’కు పిలుపునిచ్చిన నేపధ్యంలో సోమవారం వారందిరినీ ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొంత మందిని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారనే విషయాన్ని తెలుసుకున్న హరీశ్‌ రావు తిరుమలగిరి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి అక్కడ మాజీ సర్పంచులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. సర్పంచుల మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాదింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అప్పులు చేసి భార్యపిల్లల మీదున్న బంగారాన్ని అమ్మి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు ఆ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.


గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని.. మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి శిక్ష వేస్తున్నారని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు కానీ పేద సర్పంచ్‌లు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటిందని, రూ. 10లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదని ఆరోపించారు. అరెస్టు చేసిన సర్పంచ్‌లను వెంటనే బేషరతుగా వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా జిల్లాల్లోనూ సోమవారం ‘ఛలో హైదరాబాద్‌ యాత్ర’కు బయలుదేరిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

Updated Date - Nov 05 , 2024 | 04:16 AM