Harish Rao: ఉసూరుమనిపించిన రైతు పండుగ
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:50 AM
రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆడంబరంగా నిర్వహించిన రైతు పండు గ యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించా రు.
అసెంబ్లీలో కాంగ్రెస్ పాలనను ఎండగడతాం: హరీశ్
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆడంబరంగా నిర్వహించిన రైతు పండు గ యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించా రు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు యాసంగికి కలిపి ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండిచెయ్యి చూపారన్నారు. కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతుబంధు అతీగతీ లేకుండా పోయిందని పేర్కొన్నారు. రైతు పండుగలో సీఎం ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమకంటే గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని సీఎం చెబుతున్నారని, వారిని బెదిరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రమ్మని సీఎం తెగ పిలుస్తున్నారని తాము ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన అసలు రంగు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మైకులు కట్ చేయకుం డా సమయం కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బందుపెట్టే కుట్రకు తెరతీయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతుబంధు కంటే సన్నాలకు ఇచ్చే రూ.500 బోనసే మేలు అని రైతులు చెబుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు.
సురేఖకు ఆ అర్హత లేదు..: ఆర్‌ఎస్ ప్రవీణ్
కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందని, ఆమెకు మంత్రిగా ఉండే అర్హత లేదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమె సంస్కారం లేకుండా మాట్లాడుతున్న తీరును ప్రజలు గుర్తించారని, ఆమె కుటుంబం గురించి వరంగల్ ప్రజలకు తెలుసన్నారు. తాను ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకుని ఐపీఎస్ అయ్యానని, దేశ సేవ చేయడంతో పాటు ఏడేళ్ల సర్వీస్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. సంవత్సర కాలంగా విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరని, సమస్యలపై విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని పేర్కొన్నారు.