Share News

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయి.. వికారాబాద్‌ రైతులపై పడింది

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:57 AM

తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్‌ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు.

Harish Rao: పిచ్చోడి చేతిలో రాయి.. వికారాబాద్‌ రైతులపై పడింది

  • పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు: ఎమ్మెల్యే హరీశ్‌రావు

  • సర్కార్‌ తీరు వల్లే పత్తి కొనుగోళ్లు ఆగాయని ధ్వజం

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఆ రాయే ఇప్పుడు వికారాబాద్‌ రైతన్నలపై పడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌పై ఉన్న కోపాన్ని రైతులు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు దగ్గర్లో ఫార్మా సిటీ కోసం 15 వేల ఎకరాలను కేసీఆర్‌ హయాంలో సేకరించామని, అన్ని అనుమతులు తెచ్చామని గుర్తు చేశారు. అలాంటి భూమిని వదిలేసి.. పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టడం తగదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని సీఎం తన రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్యను తెచ్చిపెట్టారన్నారు. కాగా, కాంగ్రెస్‌ సర్కార్‌ వైఫల్యం వల్లే రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆరోపించారు.


పండించిన పంటను కనీస మద్దతు ధరకూ అమ్ముకోలేని దుస్థితికి తెలంగాణ రైతాంగాన్ని చేర్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందని సోమవారం ఎక్స్‌ వేదికగా విమర్శించారు. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పత్తి కొనుగోలు చేయబోమని జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు ప్రకటిస్తే.. సమస్యకు పరిష్కారం చూపకపోవడం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రికి.. రాష్ట్రంలో మంత్రులకు రైతుల సమస్యలు పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు. కాగా, మద్యం అమ్మకాల లక్ష్యం చేరుకోలేదని 30మంది ఎక్సైజ్‌ సీఐలకు మెమోలు జారీచేయడం కాంగ్రెస్‌ సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతోందని హరీశ్‌ విమర్శించారు.

Updated Date - Nov 12 , 2024 | 04:57 AM