Share News

Harish Rao: రాహుల్‌ గాంధీ కాలంచెల్లిన మందా?

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:23 AM

ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. బీఆర్‌ఎస్‌ పార్టీని ఖతంచేయడం ఆయన వల్ల కాదని మాజీమంత్రి టి. హరీశ్‌ రావు అన్నారు.

Harish Rao: రాహుల్‌ గాంధీ కాలంచెల్లిన మందా?

  • 3సార్లు ఓడిన కాంగ్రెస్‌ ఖతం అయిందా?

  • నన్ను డీల్‌ చేయడం కాదు.. సీఎం పదవిని కాపాడుకోవాలి

  • నాకు క్రికెటొచ్చు.. రేవంత్‌ వికెట్‌ తీయడం పక్కా

  • సీఎం సవాల్‌కు నేను, కేటీఆర్‌ సిద్ధం: హరీశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్‌ గురించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. బీఆర్‌ఎస్‌ పార్టీని ఖతంచేయడం ఆయన వల్ల కాదని మాజీమంత్రి టి. హరీశ్‌ రావు అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ మూడుసార్లు ఓడింది.. ఖతం అయిందా? ఒక్కసారి ఓడిపోతే కేసీఆర్‌ను కాలంచెల్లిన మందు అంటున్నావ్‌.. మూడుసార్లు ఓటమి చూసిన రాహుల్‌గాంధీ కాలంచెల్లిన మందు కాదా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదని, తెలంగాణ లేకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధమైన కేసీఆర్‌కు.. ఉద్యమాన్ని పట్టించుకోని రేవంత్‌కు నక్కకూ నాగలోకానికి ఉన్నతేడా ఉందన్నారు.


మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్‌ చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లినందుకే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌ను ఎలా డీల్‌చేయాలో తనకు తెలుసంటూ సీఎం చేసి న వ్యాఖ్యలు హాస్యాస్పదమని.. తనను డీల్‌ చేయడంకాదు ఈ నాలుగేళ్లు ఆయన తన పదవిని కాపాడుకోవాలని సూచించారు. తాను ఫుట్‌బాల్‌ ఆడనని, క్రికెట్‌ ఆడతానని, వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వికెట్‌ తీసేది తామేనని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తమకు 100 సీట్లు ఖాయమని, వచ్చేది బీఆర్‌ఎస్‌.. సీఎం అయ్యేది కేసీఆరే.. అని జోస్యం చెప్పారు. హైడ్రా కూల్చివేతలు, అబద్ధాలు, అవినీతికి ఊతమిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి వరస తప్పిదాల కారణంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, మూసీ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామని సీఎం విసిరిన సవాల్‌కు తాను కేటీఆర్‌ సిద్ధమని.. ఎప్పుడు రావాలో చెబితే తాము వస్తామని, అయితే రేవంత్‌ సెక్యూరిటీ లేకుండా రావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 31 , 2024 | 04:23 AM