Share News

Harish Rao: మోసం చేసి.. విజయోత్సవాలా?

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:20 AM

తెలంగాణ రైతాంగానికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందో చెప్పాలని నిలదీశారు.

Harish Rao: మోసం చేసి.. విజయోత్సవాలా?

  • కూలిందన్న కాళేశ్వరమే.. కాంగ్రె్‌సకు దీపమైంది

  • దళితబంధు ఇవ్వాలని అడిగితే అరెస్టు చేస్తారా..?

  • లగచర్ల విషయంలో రేవంత్‌ అబద్ధాలు: హరీశ్‌

హుజూరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగానికి రేవంత్‌రెడ్డి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందో చెప్పాలని నిలదీశారు. మహారాష్ట్ర ఫలితాలు కాంగ్రె్‌సకు గుణపాఠమని, ఇకనైనా రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆదివారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిన విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లి ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. అబద్ధాలు ఆడటంలో ఆయనకు డబుల్‌ పీహెచ్‌డీ ఇవ్వొచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి.. మరచిపోయారని తెలిపారు.


కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేక అది కూలిపోయిందని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేశారని.. నేడు కాళేశ్వరమే కాంగ్రె్‌సకు దీపమైందని చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలిందంటుంటే మరోవైపు మంత్రులు గడచిన పదేళ్లలో తెలంగాణలో అత్యధికంగా పంటలు వచ్చాయని చెబుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 30 లక్షల టన్నుల పంట పండితే.. కేసీఆర్‌ పాలనలో పదేళ్లలో కోటీ 54 లక్షల టన్నుల పంట పండిందని పేర్కొన్నారు. లగచర్ల విషయంలో ముఖ్యమంత్రి అబద్ధం ఆడటం సిగ్గు చేటన్నారు. జూలై 19న ఫార్మా సిటీకి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పచ్చని పొలాలను మింగి ఫార్మాసిటీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండో విడత దళితబంధుపై ఫ్రీజింగ్‌ ఎత్తివేసి వెంటనే లబ్ధిదారుల అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని కోరారు. దళితబంధు కోసం హుజూరాబాద్‌లో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. దళితబంధు రెండో విడత డబ్బులు ఇచ్చే విషయంలో అసెంబ్లీలో మాట్లాడతానని హరీశ్‌రావు తెలిపారు.

Updated Date - Nov 25 , 2024 | 03:20 AM