Harish Rao: ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందుల్లేవు
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:25 AM
రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల్లేవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
సంచార వైద్యశాలల పరిస్థితీ అంతే..సీఎంకు హరీశ్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల్లేవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలుగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రూ.2 వేల దాకా ఖర్చుచేయాల్సి వస్తుందని, ఇది అదనంగా ఆర్థిక భారమవుతుందన్నారు. తక్షణమే ఆస్పత్రుల్లో మందులు సమకూర్చాలని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో పశువులు రక్తహీనతకు గురవుతున్నాయని పేర్కొన్నారు.
అనారోగ్యం పాలైన మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి తక్షణ చికిత్స అందించేందుకు గాను గతంలో 1962 నెంబర్‌తో పశువైద్య సంచార వాహనాలను ఏర్పాటు చేయగా.. వాటిలోనూ మందుల కొరత కారణంగా మూగజీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందన్నారు. మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ అటకెక్కిందని, చేపల పంపిణీ ఆలస్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చేపపిల్లల పంపిణీ చేపట్టాలని ఆయన కోరారు.