Share News

Rain alert: భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచన

ABN , Publish Date - Aug 21 , 2024 | 07:08 AM

తెలంగాణలో భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెరువులు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది. ఈ తరుణంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖా హెచ్చరికల పట్ల నీటి పారుదల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

Rain alert: భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచన

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెరువులు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ తరుణంలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నీటి పారుదల శాఖ అధికారులకు ఆ శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పర్యవేక్షించిడానికి ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలన్నారు. నీటిపారుదల ఇంజినీర్ల విభాగం వారి వారి నిర్దేశిత ప్రాంతంలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తక్షణమే సంబంధిత విభాగాలను తక్షణమే అప్రమత్తం చెయ్యాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.


భారీ వర్షాల నేపథ్యంలో నిన్న అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎస్, మంత్రి పలు సూచనలు చేశారు. మరో నాలుగు రోజుల పాటు మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలుగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక శాతం పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి ధరఖాస్తులను పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలని అధికారులకు పొంగులేటి సూచించారు.


రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా సీఎస్ మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోవడం వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉధృతంగా ప్రవహించే కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ సూచించారు. వర్షాలు, వరద ప్రాభావిత ప్రాంతాల్లో స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని.. ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 08:00 AM