Share News

హైడ్రా భయంతో ఇక కబ్జాలుండవు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:20 AM

హైడ్రా ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి భద్రత లేకుండా ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయబోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైడ్రా భయంతో ఇక కబ్జాలుండవు..

  • ఎవరూ ఆ ధైర్యం చేయలేరు

  • వైసీపీ నేత కాటసాని భార్య

  • పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్య

  • భూములు ఖాళీగా ఉన్నా ఇక కబ్జా కావు

  • వైసీపీ నేత కాటసాని భార్యకు దక్కని ఊరట

  • ప్రహరీ పునర్నిర్మాణానికి అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైడ్రా ఏర్పాటు, ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి భద్రత లేకుండా ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయబోరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్‌టీఎల్‌లో ఉందన్న కారణంతో హైడ్రా కూల్చివేసిన ప్రహరీని పునర్నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిని తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. పటాన్‌చెరు సమీపంలోని అమీన్‌పూర్‌ సర్వే నంబర్లు 324, 329లో ఉన్న 9ఎకరాల వ్యవసాయ భూముల్లో ఉన్న ప్రహరీ, షెడ్లను హైడ్రా కూల్చివేయడంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ భూములు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని పేర్కొంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. తమవి పట్టా భూములని నిరూపించేలా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నీటిపారుదల శాఖ అధికారుల రిపోర్టును సమర్పించారు.


పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న పండ్ల తోటల్లో ఉన్న కట్డడాలను కూల్చివేయడం అక్రమమని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌ ధర్మాసనం.. ప్రహరీ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో ఎఫ్‌టీఎల్‌ భూములను ఖాళీ చేసి అందరూ పారిపోతున్నారని, భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయడం లేదని వ్యాఖ్యానించింది. అమీన్‌పూర్‌ చెరువు దేశంలోనే మొదటి జీవ వైవిధ్య (బయోడైవర్సిటీ) సరస్సు అని పేర్కొంది. 1970లో రూపొందించిన అమీన్‌పూర్‌ లేక్‌ మెమైర్‌ (ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ విస్తీర్ణం, హద్దుల వివరాలతో కూడిన రికార్డు) సమర్పించాలని నీటిపారుదల, మున్సిపల్‌ శాఖలు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది.

Updated Date - Sep 14 , 2024 | 04:20 AM