High Court: సర్టిఫికెట్లలో పేరు మార్పునకు తొలగిన ఇక్కట్లు
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:37 AM
చిన్నతనంలో పెట్టిన పేర్లు ఆధునికంగా లేవని భావించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మార్చుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్చిన పేర్లతో కొత్తగా ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
మార్చి కొత్తవి ఇస్తామని హైకోర్టులో సర్కారు అంగీకారం
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలో పెట్టిన పేర్లు ఆధునికంగా లేవని భావించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మార్చుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్చిన పేర్లతో కొత్తగా ధ్రువ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పేర్లు మార్చుకున్నప్పటికీ ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లలో పాత పేర్లు మార్చి కొత్తగా సర్టిఫికెట్లు జారీచేయడాన్ని నిషేధిస్తూ 1961లో జీవో నెంబరు 1263 జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ వి. మధుసూదన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ జీవోలోని సెక్షన్ (సీ) రూల్ 1, 2, 3లను కొట్టేయాలని కోరారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టబద్ధంగా పేరు మార్చుకున్న తర్వాత కొత్త సర్టిఫికెట్లు జారీచేయడానికి ఇబ్బంది ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ‘జిగ్యా యాదవ్ వర్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఎస్.రాహుల్‌రెడ్డి సమాధానం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని తెలిపారు. నిబంధనల ప్రకారం పేరు మార్చి కొత్త సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.