High Court: బాసర పూర్వ విద్యార్థికి ధ్రువపత్రాలు
ABN , Publish Date - Oct 29 , 2024 | 04:07 AM
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి ఫణికుమార్‌కు యూనివర్సిటీ అధికారులు సోమవారం విద్యార్హత ధ్రువపత్రాలు అందజేశారు.
హైకోర్టు ఆదేశాలతో అందజేసిన అధికారులు
మిగతా 5 వేల మందిది కూడా కోర్టు బాటే..!
బాసర, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి ఫణికుమార్‌కు యూనివర్సిటీ అధికారులు సోమవారం విద్యార్హత ధ్రువపత్రాలు అందజేశారు. ఫణికుమార్ ఆరేళ్ల పాటు ఇక్కడ చదువుకొని బీటెక్ పూర్తి చేశాడు. అయితే ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రాకపోవడంతో.. రూ.86 వేల బకాయిలు చెలిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని అధికారులు తెగేసి చెప్పారు.
దీంతో ఫణికుమార్ హైకోర్టును ఆశ్రయించగా.. అతడికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న మిగతా 5 వేల మంది కూడా తమకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారేమోనని అంతా భావించారు. కానీ వర్సిటీ అధికారులు మిగతా వారికి ధువ్రపత్రాలిచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో.. వారు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.