Share News

Tamidikunta Lake: దాహార్తి తీర్చి.. సంస్కృతిలో భాగమై!

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:55 AM

హైదరాబాద్‌ అంటేనే చెరువులు, కుంటలు, ఉద్యానవనాలతో అలరారిన నగరం. మహ్మద్‌ కులికుతుబ్‌ షా కలలకు అనుగుణంగా మీర్‌ మోమిన్‌ రూపకల్పనలో పురుడు పోసుకున్న ఈ నగర నిర్మాణంలోనే అవన్నీ భాగమయ్యాయి.

Tamidikunta Lake: దాహార్తి తీర్చి.. సంస్కృతిలో భాగమై!

  • చరిత్రలో తమ్మిడికుంట చెరువు జ్ఞాపకాలు.. 40 ఏళ్ల క్రితం వరకు ఖానామెట్‌ ప్రజల తాగు, సాగునీటికి ఆ చెరువే ఆధారం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ అంటేనే చెరువులు, కుంటలు, ఉద్యానవనాలతో అలరారిన నగరం. మహ్మద్‌ కులికుతుబ్‌ షా కలలకు అనుగుణంగా మీర్‌ మోమిన్‌ రూపకల్పనలో పురుడు పోసుకున్న ఈ నగర నిర్మాణంలోనే అవన్నీ భాగమయ్యాయి. కనుకే దీన్ని లేక్‌ సిటీ, బాగ్‌ నగరంగానూ చరిత్రకారులు అభివర్ణించారు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో ఇవాళ దేశవ్యాప్తంగా తమ్మిడికుంట చెరువుపై చర్చ సాగుతున్న సమయంలో దాని చరిత్రను చూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.


మాదాపూర్‌ నేడు దేశంలోనే పేరెన్నికగన్న ‘సైబర్‌ కాపిటల్‌’గా ఖ్యాతికెక్కింది. కానీ మూడు దశాబ్దాల కిందటి వరకు ఆ ప్రాంతం చెరువులు, కుంటలు, అరుదైన రాళ్ల గుట్టలు, పంట చేలతో అలరారింది. అదే ప్రాంతంలోని దుర్గం చెరువు... కుతుబ్‌ షాహీల ఏలికలో అంటే, 350 ఏళ్ల కిందటి వరకు గోల్కొండ కోటకు తాగునీరు అందించింది! దానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నెలవైన తమ్మిడికుంట సహజసిద్ధంగా ఏర్పడిందా లేక మానవ నిర్మితమో తెలియరాలేదు.


Untitled-4.jpg

కానీ నలభై ఏళ్ల కిందటి వరకు అది ఖానామెట్‌ ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చిందని ఆ చెరువు పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చెబుతున్నారు. 29 ఎకరాల 60 గుంటల విస్తీర్ణంలోని తమ్మిడికుంట నిన్నమొన్నటి వరకు పరిసర ప్రాంత ప్రజల సంస్కృతిలో భాగమైంది. గణపతి నిమజ్జనం, బతుకమ్మ పండుగ లాంటి వేడుకలకు నిన్నటి తరం జ్ఞాపకాల్లో ఆ కుంట పదిలం. ఈ కుంటకు ఆ పేరు ఎలా వచ్చిందని ఆరా తీయగా... తమ్మి అంటే పద్మమని, తామరపూలకు నెలవైనందున తమ్మిడికుంట పేరు స్థిరపడి ఉంటుందని భాషావేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.


తమ్మిడికుంట చెరువు సమగ్ర స్వరూపం

గ్రామం ఖానామెట్‌; సర్వే నెంబర్లు 36, 11/2; విస్తీర్ణం 29.6 ఎకరాలు

నాగార్జున భూమి 8 ఎకరాలు (11/2 సర్వే నెంబర్‌లో ఉంది)

ఇందులో ఎఫ్‌టీఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్‌ జోన్‌లో 2.18 ఎకరాలు

వీటిలో ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌, ఇతర షెడ్లు కూల్చివేశారు. ఎన్‌ కన్వెన్షన్‌

నిర్మాణానికి ముందు ఆ భూమిలో నాగార్జున అతిథి గృహం ఉండేది.

ఎఫ్‌టీఎల్‌ పరిధి బఫర్‌ జోన్‌ పరిధి ఎన్‌ కనెవెన్షన్‌ హాల్‌ (సర్కిల్‌)


కన్వెన్షన్‌ కథా కమామిషు ఇదీ..

ఖానామెట్‌ గ్రామం సర్వే నెంబర్‌ 36లో 29.06 ఎకరాల విస్తీర్ణంలో తమ్మిడికుంట చెరువు ఉంది. పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 11/2లో సినీనటుడు నాగార్జునకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 2010లో ఎన్‌ కన్వెన్షన్‌, ఇతర నిర్మాణాలను చేపట్టారు. అయితే సర్వే నెంబర్‌ 11/2లోని మూడు ఎకరాలు తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులోని నిర్మాణాలనే కూల్చివేశారు. కాగా, ఎన్‌ కన్వెన్షన్‌.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే జీహెచ్‌ఎంసీకి, రెవెన్యూ విభాగాలకు ఫిర్యాదులందాయి.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అప్పటి ప్రభుత్వం ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలు, స్థల యజమాన్యపు హక్కు వివరాలు ఇవ్వాలని పేర్కొంది. కానీ, యజమానుల నుంచి సమాధానం రాకపోవడంతో.. దానిని అనుమతి లేని నిర్మాణంగా పరిగణించి కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం కోర్టుకు వెళ్లింది. పట్టా భూమిలో నిర్మాణం ఉందని, చెరువు/ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఎన్‌ కన్వెన్షన్‌.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోనే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ సక్రమంగా లేదంటూ కన్వెన్షన్‌ యాజమాన్యం 2017లో మరోసారి మియాపూర్‌లోని అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభుత్వ విభాగాలు కూడా కూల్చివేతల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Updated Date - Aug 25 , 2024 | 07:55 AM