Share News

OU : ఓయూ సెలవులపై దుమారం!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:54 AM

ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు జారీ చేయడం

OU : ఓయూ సెలవులపై దుమారం!

మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు చీఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు

ఏటా ఇలాగే నీటి, కరెంటు సమస్యను ప్రస్తావిస్తూ సెలవులిస్తామని వెల్లడి

ఈ సారి సెలవులపై కేసీఆర్‌ విమర్శలు

విద్యార్థులు వెళ్లాల్సిన అవసరం లేదు Vనిశ్చింతగా చదువుకోండి: భట్టి

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. వర్సిటీకి గత కొన్నేళ్లుగా వేసవిలో సెలవులు ఇస్తున్నట్లుగానే.. ఈ ఏడాది కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో చీఫ్‌ వార్డెన్‌ పేర్కొన్నా.. వేసవిలో తలెత్తే నీటి సమస్య, కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావించడం ఈ వివాదానికి కారణమైంది. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ అంశంపై ‘ఎక్స్‌’లో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్తు కోతలతోపాటు తాగునీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు పేర్కొన్నారు. అయితే ప్రతి ఏటా వర్సిటీకి ఇలాగే వేసవి సెలవులు ఇస్తుంటామని, విద్యుత్తు, నీటి కొరత అంశాన్ని ప్రస్తావిస్తుంటామని చీఫ్‌ వార్డెన్‌ తెలిపారు. గత ఏడాది కూడా ఇలాగే ఉత్తర్వుల్లో పేర్కొన్నామని వెల్లడించారు. మరోవైపు ఓయూకు విద్యుత్తు సరఫరాలో ఎటువంటి కోతల్లేవని, తాగునీటి కొరత కూడా లేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతున్నట్లుగా డిజిటల్‌ మీటర్‌లో రీడింగ్‌ కూడా నమోదైందని తెలిపారు. తప్పుడు ప్రకటన చేసిన చీఫ్‌ వార్డెన్‌కు ఓయూ రిజిస్ట్రార్‌ ద్వారా షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, పదేళ్లుగా వర్సిటీలో ఇలాంటి సమస్యలే ఉన్నా ఎన్నడూ స్పందించని కేసీఆర్‌, హరీశ్‌కు ఇప్పుడే కోతలు గుర్తుకొచ్చాయా?అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి.


గతేడాది కూడా వేసవి సెలవులు..

ఉస్మానియా వర్సిటీకి గతేడాది కూడా మే 14వ నుంచి జూన్‌ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఆ సందర్భంలోనూ నీటి, కరెంటు కొరత సమస్యలతో సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటీసు నెం.752/సీడబ్ల్యూఓ/హెచ్‌అండ్‌ఎం/ఓయూ/2023తో జారీ చేసింది. ఆ సందర్భంలో విద్యార్థులు సైతం పోటీ పరీక్షల నేపథ్యంలో.. ‘మాకు సెలవులు అవసరం లేదు. మెస్‌, హాస్టళ్లు మూసివేయొద్దు. మేం పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది.’ ఓయూలో ఆందోళనలు నిర్వహించారు. అయినా.. అప్పట్లో బలవంతంగానే హాస్టల్స్‌, మెస్‌ను బంద్‌ చేశారు. విద్యార్థులు ఖాళీ చేయకపోవడంతో గతేడాది అన్నీ హాస్టల్స్‌కు కరెంటు సరఫరా నిలిపివేశారు. నీటి సరఫరా బంద్‌ చేశారు. విద్యార్థులను బలవంతంగా వర్సిటీ హాస్టల్స్‌ నుంచి ఖాళీ చేయించారు. పదేళ్లుగా ఉస్మానియా వర్సిటీలో ప్రతీ ఏడాది సాగుతున్న ప్రక్రియ ఇదీ. కానీ అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్‌, మంత్రి హరీ్‌షరావులు స్పందించలేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.


నీటి ఎద్దడి వాస్తవం: కేసీఆర్‌

ఓయూకు వేసవి సెలవులపై మాజీ సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ, ‘‘రాష్ట్రంలో విద్యుత్తు, సాగు, తాగునీటి సరఫరాపై నాలుగు నెలలుగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ చీఫ్‌ వార్డెన్‌ నోటీసుతో వారి వాదనలన్నీ పటాపంచలయ్యాయి. తెలంగాణలో విద్యుత్‌ కోతలతో పాటు సాగు, తాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవం’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. కేసీఆర్‌ పోస్టును రీట్విట్‌ చేసిన హరీశ్‌రావు కూడా ‘వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కొరత, నీళ్ల కొరత ఉందని విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు, తాగు నీటి కొరత తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని దబాయిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేేస ఇలాంటి సంకుచిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఎక్స్‌లో హరీశ్‌రావు రాసుకొచ్చారు.


గతేడాది కూడా ఇదేవిధమైన ఉత్తర్వులు : ఓయూ చీఫ్‌ వార్డెన్‌

ఓయూ సెలవుల రగడపై ‘ఆంధ్రజ్యోతి’ వర్సిటీ వీసీ రవీందర్‌కు ఫోన్‌లో ప్రయత్నించగా స్పందించలేదు. చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివా్‌సరావు నోటీసుపై స్పందించారు. ‘అన్ని వర్సిటీలు వేసవి సెలవులిస్తాయి. అందులో భాగంగానే నెల రోజులు సెలవులిచ్చాం. సెలవులు ప్రకటించే సందర్భంలో విద్యుత్తు, నీటి కొరత ఉందన్నట్లుగా నోటీసులో ప్రస్తావిస్తాం. అదే అంశాన్ని తాజా నోటీసులో పేర్కొన్నాం. గతేడాది కూడా ఇదేవిధమైన ఉత్తర్వులిచ్చాం’ అని తెలిపారు. అయితే, అధికారుల నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందని ఏబీవీపీ యూనివర్సిటీస్‌ కన్వీనర్‌ జీవన్‌ అన్నారు. కాగా, ఏటా వేసవి సెలవుల పేరుతో విద్యార్థులను ఖాళీ చేయిస్తారని ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్‌ తెలిపారు. ఆ పరిస్థితి లేకుండా స్వేచ్ఛగా చదువుకునే అవకాశం కల్పించాని కోరారు. ఇప్పుడు స్పందించిన కేసీఆర్‌, హరీశ్‌రావు గతంలో విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు.


విద్యుత్తు, తాగునీటి కొరత లేదు: భట్టి

ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, వర్సిటీలో విద్యుత్‌, తాగునీటి కొరత లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్‌ వార్డెన్‌ తప్పుడు ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై తాము విచారణకు ఆదేశించామని, విద్యుత్‌ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో తేలిందని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌ లోని 33/11 కేవీ సబ్‌ ేస్టషన్‌ నుంచి రెండు ప్రత్యేక 11 కేవీ ఫీడర్ల ద్వారా నిరంతర విద్యుత్‌ వర్సిటీకి సరఫరా అవుతుందని, ఈ విషయం డిజిటల్‌ మీటర్‌ రీడింగ్‌లో కూడా స్పష్టమైందని అధికారులు నివేదికలో గుర్తు చేశారని తెలిపారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. ఇక వర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, వారు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా చదువుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వం అలవాటు మాదిరిగానే ఈ ఏడాది అధికారులు ప్రకటన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత ఏడాది జారీ చేసిన ప్రకటన తమ వద్ద ఉందన్నారు. మరోవైపు వాటర్‌ బోర్డు కూడా ఈ అంశంపై స్పందించింది. వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు సంబంధిత అసిస్టెంట్‌ ఇంజినీర్‌తో కలిసి యూనివర్సిటీని సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరమైతే ఓయూ అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేేసందుకు వాటర్‌బోర్డు సిద్ధంగా ఉందన్నారు. వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌ రెడ్డి.. ఓయూ వీసీ రవీందర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు. దీంతో వివాదానికి కారణమైన వార్డెన్‌పై వీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated Date - Apr 30 , 2024 | 04:54 AM