Hyderabad: ఊపిరాడని ప్రయాణం.. మండే ఎండల్లో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు
ABN , Publish Date - Apr 17 , 2024 | 10:47 AM
హైదరాబాద్ మహానగరంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులకు మాత్రమే కొందరు గడప దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
- సామర్థ్యానికి మించి రాకపోకలు
- బోగీల్లో పిల్లలు, మహిళల ఇబ్బందులు
- అదనపు కోచ్‌లను పెంచడంలో నిర్లక్ష్యం
ఎండలు ముదరడంతో మెట్రో రైళ్ల(Metro trains)లో ప్రయాణానికి డిమాండ్ ఏర్పడింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు తరలివెళ్తుండడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. సాధారణ రైళ్లలోని జనరల్ బోగీల మాదిరిగా ఊపిరాడని స్థితిలో ప్రయాణించాల్సి వస్తోంది. పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు కోచ్‌లను పెంచడంలో ఎల్అండ్టీ, మెట్రో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహానగరంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులకు మాత్రమే కొందరు గడప దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఉద్యోగులు, విద్యార్థులతోపాటు పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సాధారణ ప్రజలు మెట్రోరైళ్లనే ఆశ్రయిస్తుండడంతో స్టేషన్లలో ఎప్పుడు చూసినా రద్దీనే కనిపిస్తోంది.
5.30 లక్షలకు చేరిన ప్రయాణికులు..
మెట్రో రైళ్లలో ఈ ఏడాది ఊహించని విధంగా ప్రయాణికులు పెరుగుతున్నారు. ప్రధానంగా మార్చి 15 నుంచి రోజూ సగటున 4.90 లక్షల నుంచి 5.10 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నట్లు ఎల్అండ్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఆదివారం 5.20లక్షల మంది ప్రయాణించగా.. సోమవారం 5.30 లక్షల మంది వరకు మెట్రో రైళ్లలో తిరిగినట్లు వెల్లడించాయి. ప్రతి 6 నిమిషాలకోసారి రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ అవి సరిపోవడంలేదని స్టేషన్లలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతుండడంతో రైలు కిందపడుతారేమోనని భయపడుతున్నామని తెలిపారు.
ఇదికూడా చదవండి: Vemulawada: రాజన్న ఆలయంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి..
రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఎల్అండ్టీ అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రవాణా రంగ నిపుణులు కోరుతున్నారు. గతంలో ప్రతిపాదించిన విధంగా ప్రతి రైలుకు అదనంగా మూడు బోగీలను ఏర్పాటు చేస్తే రద్దీని త్వరగా నియంత్రించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకోసారి రైలును నడిపించాలని, లేకుంటే రానున్న రోజుల్లో ప్రయాణికుల తాకిడితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..