Hyderabad: వేడి గాలులతో డేంజర్.. ఒంట్లో నీటి శాతం తగ్గి అస్వస్థత
ABN , Publish Date - Apr 24 , 2024 | 09:00 AM
వేసవిలో వేడి గాలులకు ఒంట్లో శక్తి సన్నగిల్లిపోతుందని, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, లవణాలు కోల్పోయే ప్రమాదం ఉత్పన్నమవుతుందని వైద్యులు(Doctors) పేర్కొంటున్నారు.
- అధిక ఉష్ణోగ్రతలతో ఆస్పత్రులకు పరుగులు
హైదరాబాద్ సిటీ: వేసవిలో వేడి గాలులకు ఒంట్లో శక్తి సన్నగిల్లిపోతుందని, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందని, లవణాలు కోల్పోయే ప్రమాదం ఉత్పన్నమవుతుందని వైద్యులు(Doctors) పేర్కొంటున్నారు. బాధితులకు ఒంట్లో శక్తి హరించుకుపోతుందని, ఏ పనిచేయాలన్నా ఆందోళన చెందుతారని చెబుతున్నారు. వారిలో కండరాలు పట్టేయడం, సొమ్మసిల్లడం, నీరసించిపోవడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, కళ్లు ఎర్రగా మారడం, తల తిరగడం, తలనొప్పి, నాలుక పిడచ కట్టుకుపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయంటున్నారు. ఇలాంటి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చే వారిలో కొందరిలో 103 డిగ్రీల సెల్సియస్ జ్వరం ఉంటుందని, చాలా బలహీనంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పనుల కోసం బయటకు వెళ్లే వారు ఎక్కువగా హీట్ స్ట్రోక్ బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇదికూడా చదవండి: Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?
చల్లటి నీళ్లు తాగితే..
వేసవిలో చాలామంది చల్లదనం కోసం ఫ్రిజ్‌లో నీళ్లు తాగుతారు. వీరికి మెదడులో ఉండే దప్పిక కేంద్రం నీళ్లు చాలనే సిగ్నల్ ఇస్తుంది. దీంతో అవసరం మేరకు నీళ్ళు శరీరంలోకి వెళ్లవు. అందుకని గది ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు తాగాలి. అప్పుడే శరీరంలో నీటి శాతం భర్తీ అవుతుంది. నీళ్లు ఎక్కువ తీసుకుంటే లోపల ఉన్న టెంపరేచర్ బయటకు పోతుంది.
వేసవిలో ఇలా చేయాలి
వేసవిలో చాలామంది షార్ట్‌లు...టీ షర్టులు, బనియన్లు వేసుకుంటారు. ఇలాంటి దుస్తుల వల్ల త్వరగా డీ హైడ్రేషన్ బారినపడతారు. ఈ కాలంలో లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. బస్సులో వెళ్లేటప్పుడు చాలామంది కిటికీ అద్దాలు తీస్తారు. దీనివల్ల బయట ఉండే వేడి గాలి సోకి హీట్‌స్ట్రోక్ బారిన పడి సొమ్మసిల్లిపోతారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కొంతమంది వేసవి తాపానికి ఇంట్లో ఫ్యాన్‌ను ఎక్కువ స్పీడ్‌లో పెట్టుకుంటారు. అప్పటికే గది వేడిగా ఉండడం వల్ల ఆ గాలి శరీరానికి తగిలి డీహైడ్రేషన్ బారిన పడతారు. ఎండల్లో పెద్ద వయసు వారు బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు లీటర్ నీళ్లు తాగాలి. తలకు టోపీ ధరించాలి. దీనివల్ల ముఖంపై ఎండ పడదు. హీట్‌స్ట్రోక్ బారిన పడిన వారిని తడిగుడ్డతో తుడిచి ఉష్ణోగ్రతను తగ్గించి సాధారణ స్థితికి తీసుకురావాలి. వేసవిలో మజ్జిగ, కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి.
ఇదికూడా చదవండి: తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టినోళ్లు నీతులు చెప్పడమా?
చెమట రాకపోతే ప్రమాదంగా గుర్తించాలి
వేసవిలో చెమట రాకపోతే డీ హైడ్రేషన్‌గా భావించాలి. చమట రూపంలో నీటి శాతం, ద్రవరూపంలో లవణాలు బయటకు వెళ్లిపోతాయి. ఇలా పోయిన నీటి శాతాన్ని భర్తీ చేసేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీటిశాతం తగ్గితే చమట బయటకు రాదని, ప్రమాదకరమని గుర్తించాలి. ఇబ్బందిగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. వేసవిలో నీళ్లు ఎక్కువ తాగాలి. మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగాలి. వడదెబ్బ తగిలి జ్వరం అనిపిస్తే పారాసిటమాల్ మాత్రలు వేసుకోవద్దు. దానివల్ల ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయి.
డాక్టర్ టీఎన్‌జే.రాజేష్, సీనియర్ జనరల్ ఫిజీషియన్, స్టార్ ఆస్పత్రి
ఇదికూడా చదవండి: Hyderabad: కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. కిరాతకంగా గొంతుకోసి, బండరాయితో మోది..
Read Latest National News and Telugu News