Share News

Hyderabad Police: తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:27 AM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ నగర పోలీసులు హెచ్చరించారు.

Hyderabad Police: తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

  • సోషల్‌ మీడియాలో పోస్టులపై పోలీసుల హెచ్చరిక

  • అల్లు అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ అపోహలకు గురిచేసేలా వీడియోలు

  • ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి: పోలీస్‌ శాఖ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ నగర పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికల్లో కొంతమంది ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నిర్లక్షం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు, సమాచారం పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన క్రమం, ప్రమాదం జరిగిన వివరాలు, సమయం తదితర విషయాలకు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడిన వీడియోను రూపొందించి ప్రజల ముందుంచామని తెలిపారు.


కేసును ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అయినా.. కొంతమంది పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్‌ శాఖను అగౌరవపరిచేలా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించబోమన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీస్‌ శాఖకు అందించాలని, అంతే తప్ప సొంత వాఖ్యానాలు చేయవద్దని అన్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.

Updated Date - Dec 26 , 2024 | 05:27 AM