Hyderabad: నిలిచిన గోదావరి జలాలు.. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ABN , Publish Date - Jan 26 , 2024 | 11:35 AM
మహానగరానికి గోదావరి జలాలు(Godavari waters) నిలిచిపోయాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకంలో కొండపాక దగ్గరున్న పంప్‌హౌస్ వద్ద గురువారం ఉదయం భారీగా లీకేజీ ఏర్పడడంతో నీటి సరఫరాను నిలిపేశారు.
- అత్యవసరంగా మరమ్మతులు.. పునరుద్ధరణ
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): మహానగరానికి గోదావరి జలాలు(Godavari waters) నిలిచిపోయాయి. గోదావరి తాగునీటి సరఫరా పథకంలో కొండపాక దగ్గరున్న పంప్‌హౌస్ వద్ద గురువారం ఉదయం భారీగా లీకేజీ ఏర్పడడంతో నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోగా, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, అల్వాల్(Quthbullapur, Bachupally, Alwal), మల్కాజిగిరి, నిజాంపేట్, బొల్లారం ప్రాంతాలకు పాక్షికంగా అంతరాయం తలెత్తింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన వాటర్ బోర్డు అధికారులు కొండపాకలోని పంపుహౌస్‌లో అత్యవసరంగా మరమ్మతులు చేపట్టారు. పంప్‌హౌస్‌లో వాల్వ్‌లకు మరమ్మతులు మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు సాగాయి. గోదావరి జలాల పంపింగ్ ప్రక్రియ సైతం రాత్రి నుంచే ప్రారంభించారు. నగరానికి గురువారం రాత్రి 9 గంటల తర్వాత గోదావరి జలాలు చేరతాయని, నీటి సరఫరాలో ఏ అంతరాయం ఉండదని వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు.
తరచూ వాల్వ్ లీకేజీలు..
కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నీటి సరఫరాలో తరచూ వాల్వ్ లీకేజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో నగరానికి జలాల తరలింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాణ్యతలేని వాల్వ్‌లను వాడుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు అధికారులు గుర్తింపు లేని సంస్థల వాల్వ్‌లకు నెలనెలా రూ.లక్షల వ్యయం చేస్తూ ఏటా భారీగా డబ్బులు దండుకుంటున్నారని సమాచారం. వాల్వ్‌ల బిగింపులో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వాటర్‌బోర్డులోని కొందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.