Hyderabad: వైన్‌షాపులు క్లోజ్.. బెల్ట్ షాపులు ఓపెన్
ABN , Publish Date - Mar 26 , 2024 | 10:47 AM
హోలీ వేళ నగరంలో మద్యం విచ్చలవిడిగా లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమ్మకాలు ఆగలేదు.
- పాతబస్తీలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు
- రెండింతల ధరలతో అమ్మకాలు
హైదరాబాద్ సిటీ: హోలీ వేళ నగరంలో మద్యం విచ్చలవిడిగా లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమ్మకాలు ఆగలేదు. బెల్ట్‌షాపుల ద్వారా విక్రయాలు జోరుగా సాగాయి. దూల్‌పేట, పాతబస్తీలోని పలు ప్రాంతాలకు మద్యం కోసం నగరవాసులు బారులు కట్టారు. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆయా ప్రాంతాలకు తరలివెళ్ళారు. రెండింతలు ధరలు పెట్టి మరీ చాలామంది మద్యాన్ని కొనుగోలు చేశారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్(Mangalhat Police Station) పరిధిలోని గంగాబౌలి, అప్పర్ ధూల్‌పేట్, లోయర్ ధూల్‌పేట్, ఇందిరానగర్, గుఫ్ఫానగర్ తదితర ప్రాంతాల్లోని బెల్ట్‌షాపుల్లో పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు పెద్దఎత్తున అమ్మకాలు సాగాయి. బహిరంగంగా విక్రయాలు జరిపినా, ఆవైపు పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో మద్యం ఏరులై పారింది. క్వాటర్ బాటిల్ మీద రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేశారు. వీధుల్లోనే కొందరు మహిళలు పోటీపడి మరీ విక్రయాలు జరిపారు.
మత్తులో జోగిన ఎక్సైజ్ శాఖ అధికారులు
నగరంలోని పలుప్రాంతాల్లో వైన్‌షాప్ నిర్వాహకులే హోలీ వేళ.. బెల్ట్ షాపులను తెరిచారు. మద్యం విక్రయాలన్నీ ఆయా ఎక్సైజ్‌శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలున్నాయి. నాచారంలోని ఓ వైన్‌షాపు నిర్వహకులు కూడా సమీపంలోని ఓ ఇంట్లో నుంచి విక్రయాలు జరుపగా, అంబర్‌పేట, ముషీరాబాద్‌లోనూ కొందరు వైన్‌షాపు నిర్వాహకులు అమ్మకాలు జరిపినట్లు తెలిసింది. లంగర్‌హౌజ్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ యజమానే సమీపంలోని ఓ గోదాంలో మద్యం ఏర్పాటు చేసి జోరుగా విక్రయించినట్లు సమాచారం.
అదేవిధంగా గచ్చిబౌలిలోని ఓ పబ్ నిర్వహకుడు కూడా ఓ వాహనంలో మద్యం అమ్మకాలు సాగించారు. ఇలా నగరం నలుమూలాల హోలీ వేళ.. మద్యం విక్రయాలు పెద్దఎత్తున జరిపారు.