Share News

Hyderabad: మార్చి నుంచి జీరో బిల్లులు.. తుది దశకు ‘గృహజ్యోతి’

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:46 PM

గ్రేటర్‌లో గృహజ్యోతి దరఖాస్తుల పరిశీలన తుదిదశకు చేరింది. మరో రెండు రోజుల్లో లబ్ధిదారుల సంఖ్యపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం నిర్వహించే బహిరంగసభలో గృహజ్యోతి

Hyderabad: మార్చి నుంచి జీరో బిల్లులు.. తుది దశకు ‘గృహజ్యోతి’

- ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 10.81 లక్షలు

- హబ్సిగూడ సర్కిల్‌లో అత్యధికంగా 1.62 లక్షలు

- కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో గృహజ్యోతి దరఖాస్తుల పరిశీలన తుదిదశకు చేరింది. మరో రెండు రోజుల్లో లబ్ధిదారుల సంఖ్యపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం నిర్వహించే బహిరంగసభలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో పథకం అమలుపై విద్యుత్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల నుంచి జీరో బిల్లులు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజల నుంచి గృహజ్యోతి పేరిట దరఖాస్తులను స్వీకరించింది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో మొత్తం 48 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ఈ పథకం కోసం 19.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. ఫిబ్రవరి 26 నాటికి మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్ల పరిధిలోని 9 సర్కిళ్లలో 10,81,070కు చేరినట్లు అధికారులు తెలిపారు. మార్చి 1 నాటికి ఈ సంఖ్య మరో 50-60 వేలు పెరిగే అవకాశముందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది.

అత్యధికంగా హబ్సిగూడలో..

హబ్సిగూడ సర్కిల్‌లో మొత్తం 7.31 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుతూ, తెల్లరేషన్‌ కార్డు కలిగినవారు 1.62 లక్షల మంది ఉన్నారు. గ్రేటర్‌ జోన్‌ 9 సర్కిళ్లలో లబ్ధిదారుల సంఖ్య ఇక్కడే అత్యధికం. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 1.58 లక్షలు, మేడ్చల్‌ సర్కిల్‌లో 1.48 లక్షల మంది లబ్ధిదారులున్నారు. బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 59 వేలు, సైబర్‌సిటీ 92 వేలు, హైదరాబాద్‌ సెంట్రల్‌ - 93 వేలు మందిని గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించారు. పథకాన్ని ప్రభుత్వం ఈ నెల ప్రారంభిస్తే మార్చి 1 నుంచి జీరో బిల్లింగ్‌ ప్రక్రియ ప్రారంభించే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:46 PM