Share News

Hyderabad : రాష్ట్రంలో కొత్తగా 18 ఆర్ట్‌ కేంద్రాలు

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:13 AM

ఎయిడ్స్‌ బాధితులకు వైద్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 16 జిల్లాల్లో 18 చోట్ల యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ(ఆర్ట్‌) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీశాక్స్‌)కి అప్పగించారు.

Hyderabad : రాష్ట్రంలో కొత్తగా 18 ఆర్ట్‌ కేంద్రాలు

  • ఏర్పాటు బాధ్యత టీశాక్స్‌కు

  • ఎయిడ్స్‌ బాధితులకు ఊరట

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ బాధితులకు వైద్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 16 జిల్లాల్లో 18 చోట్ల యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ(ఆర్ట్‌) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీశాక్స్‌)కి అప్పగించారు. ములుగు, గద్వాల, వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రులు, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఆస్పత్రులతో పాటు హన్మకొండ క్షయ ఆస్పత్రిలో ఈ ఆర్ట్‌ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. వీటితో పాటు మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, భువనగిరి ఎయిమ్స్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాలలోని మెడికల్‌ కాలేజీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(న్యాకో) గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 26 ఆర్ట్‌ కేంద్రాలున్నాయి. కాగా, తెలంగాణలో 1.05 లక్షల మంది ఎయిడ్స్‌ బాధితులున్నట్లు న్యాకో లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కొత్తగా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, ప్రతీ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో తప్పనిసరిగా ఆర్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మన రాష్ట్రంలో మొత్తం 28 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండగా.. ఇప్పటికే అపోలో, మల్లారెడ్డి సహా ఐదు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఆర్ట్‌ కేంద్రాలున్నాయి. మిగిలిన 23 ప్రైవేటు కాలేజీల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దాంతో ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి ఆర్ట్‌ కేంద్రాల సంఖ్య 67కు పెరగనుంది.

Updated Date - Jun 26 , 2024 | 07:20 AM