Mohanbabu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
ABN , Publish Date - Dec 12 , 2024 | 09:46 AM
Telangana: మంచు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. జన్‌పల్లిలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు... తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రముఖ నటుడు మోహన్ బాబుపై (Actor Mohan Babu) పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. జన్‌పల్లిలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మోహన్ బాబు దాడి ఘటనపై విచారణ జరిపిన పోలీసులు... తొలుత మోహన్ బాబుపై 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని పెద్దఎత్తున్న జర్నలిస్టులు నిరసన, ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరిపి, ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసును నమోదు చేశారు.
అలాగే మంచు విష్ణు, మంచు మనోజ్‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. డిస్టిక్ట్ అడిషన్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ వారికి నోటీసులు జారీ చేయడంతో.. నిన్న విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా సీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే శాంతిభద్రతలను విఘాతం కలిగేలా మరోసారి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విచారణ సమయంలో సీపీ తెలిపారు. కేవలం కుటుంబసభ్యులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కూడా మీ ఇంట్లో ఉండకూడదని సీపీ ఆదేశాలిచ్చారు. దీంతో విష్ణు, మనోజ్‌కు చెందిన బౌన్సర్లు, ప్రైవేటు వ్యక్తులను అక్కడి నుంచి పంపించి వేశారు.
అలాగే వారి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మంచు విష్ణు, మనోజ్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బౌన్సర్లను, ప్రైవేటు వ్యక్తులను తన ఇంటి నుంచి పంపించివేశానని.. ప్రస్తుతం తాను షూటింగ్‌కు వెళ్తున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. అలాగే శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ముందుకు వెళ్తానని మనోజ్ స్పష్టం చేశారు. మరోవైపు గాయాల కారణంగా కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్న మోహన్ బాబు కూడా ఈరోజు (గురువారం) మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏయే అంశాలపై మోహన్ బాబు మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు
Read Latest AP News And Telugu News