Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?
ABN , Publish Date - Mar 25 , 2024 | 08:49 AM
Holi Celebrations: ‘‘బురా మత్ మానో.. హోలీ హై..’’ అంటూ ఒకరికొకరు రంగులు (Colours) పులుముకుంటూ ఏళ్ల నాటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి హోలీకి (Holi) ఉంది. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన ఈ వేడుకను ఏటా నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా కొందరు ఆదివారమే వేడుకల్లో మునిగిపోయారు...
ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన వేడుక
ప్రాంతాలు, ఆచారాలకు అనుగుణంగా ఏర్పాట్లు
ఐదు రోజులపాటు నిర్వహించుకోనున్న సింధీలు
సంప్రదాయ పద్ధతిలో రాజస్థానీలు..
పాతబస్తీలో కులమతాలకతీతంగా సంబరాలు
కూకట్‌పల్లిలోని హెచ్‌ఎండీఏ మైదానంలో యువత సందడి
‘‘బురా మత్ మానో.. హోలీ హై..’’ అంటూ ఒకరికొకరు రంగులు (Colours) పులుముకుంటూ ఏళ్ల నాటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి హోలీకి (Holi) ఉంది. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన ఈ వేడుకను ఏటా నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా కొందరు ఆదివారమే వేడుకల్లో మునిగిపోయారు.
హైదరాబాద్ సిటీ/కూకట్‌పల్లి : నగరంలో హోలీ వేడుకల ఉత్సాహం ప్రారంభమైంది. శివార్లలోని కొన్ని రిసార్ట్‌లలో ఆదివారమే వేడుకలు చేశారు. మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో రెండు రోజులపాటు సంబరాలను చేస్తూ సన్‌డౌనర్ పార్టీలకూ ఏర్పాట్లు చేయడం విశేషం. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ–2024 పేరుతో ఆదివారం వేడుకలను నిర్వహించారు. అంతర్జాతీయ డీజే బృందం సైడెరో, పిలిక్స్, అజయ్, నితిన్ ప్రదర్శించిన మ్యూజిక్ హుషారెక్కించింది. సినీతారలు సెజల్ మాండవియా, ట్వింకిల్ కపూర్, మధులగ్నాదాస్ ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఐదురోజుల పండుగ!
భాగ్యనగరంలో భిన్న సంస్కృతులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ప్రాంతాలు ఏవైనా ఇక్కడ అందరూ కలిసి కట్టుగా వేడుకలను నిర్వహించుకుంటారు. ఎవరికి వారు ప్రత్యేకతను చాటుకుంటారు. బేగంబజార్, సిద్ది అంబర్‌బజార్‌లో ఉంటున్న రాజస్థానీలు కామదహనానికి పెద్దపీట వేస్తారు. హోలీ ముందు కర్రలు, పిడకలు, నెయ్యితో కామదహనం ఏర్పాటు చేస్తారు. రాజస్థానీపండిత్‌ల మంత్రోచ్ఛరణల మధ్య కాముడు చుట్టూ ప్రదక్షణలు చేసి దహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌లో ఉండే సింధులు ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహించుకుంటారు. కుటుంబాలకు పరిమితం కాకుండా స్నేహితులతో సందడి చేస్తారు. బిహారీలు రెండు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఉట్లను కొడతారు. ఇలాంటి సంస్కృతి బంజారాహిల్స్ ప్రాంతంలో కనిపిస్తుంది.
విభిన్నంగా గిరిజనులు..!
బంజారాహిల్స్ అనగానే గుర్తుకువచ్చేది ధనవంతులు. ఆ తర్వాత లంబాడీలు. వెంకటేశ్వరనగర్, బంజారాహిల్స్ రోడ్డు నంబరు.12లో నివసించే గిరిజనులు హోలీని విభిన్నంగా జరుపుకొంటారు. హోలీకి ముందురోజు ఆరాధ్య దైవం సిట్ట మాతకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ రంగులు పులుముకుంటారు. బంధువుల ఇళ్లకు కుటుంబ సపరివార సమేతంగా వెళ్లి రంగులు పోసుకుంటారు. మగవారు తల పాగా తప్పనిసరిగా ధరిస్తారు.
పాతబస్తీలో దూలండి..
పాతబస్తీలో కులాలు, మతాలకతీతంగా పెద్దలందరూ కలిసి డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య దూలండి నిర్వహిస్తారు. యువత కేరింతలు, నృత్యాల మధ్య జరుపుకునే దూలండిలో బస్తీలోని హిందువులు, ముస్లింలు పాల్గొంటారు. చిన్న తప్పిదాల కారణంగా దూరమైన వారు కూడా అన్ని మరిచిపోయి బంధుత్వం దృఢం కావాలని దూలండిలో పాల్గొంటారు.
వినూత్నంగా కార్పొరేట్ రంగం..
కార్పొరేట్ రంగం వినూత్నంగా నిర్వహిస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలవాసులు ఓ బృందంగా వేడుకలను ఉత్సాహ భరితంగా చేసుకుంటారు. పది కుటుంబాలు కలిసి ఓకే దగ్గర జరుపుకొంటారు. యువత రెయిన్ డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటు చేయించుకుంటారు. ఇక పబ్‌లు, రెస్టారెంట్ లు కూడా లైఫ్‌స్టైల్ ప్రియుల కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పిస్తుంటాయి. డ్యాన్స్ ఫ్లోర్‌లో తొట్టెలు పెట్టి వాటిని నీటితో నింపి పైపులతో జల్లు కురిపిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే సంగీతానికి అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతుంటారు.
నోరూరించే రుచులు..
హోలీ అనగానే రంగులే కాదు.. దక్షిణాది రుచులు నోరూరిరుస్తుంటాయి. ఇళ్లలో సంప్రదాయబద్ధంగా పిండి వంటలు చేసుకుంటారు. కోల్‌కత్తా రుచులు గ్రీసీ కచోరాస్, దాహి బల్లాస్ భోజన ప్రియులను నోరూరిస్తుంటాయి. దక్షిణాది మిఠాయిలు రస్‌గుల్లా, రస్ మలై, చుమ్ చుమ్ వంటి స్వీట్లకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. జొన్నలు, బెల్లం, కొబ్బరితో చేసే గుజియాలు హోలీ ప్రత్యేక వంటకం. రెస్టారెంట్‌లు ఈ రుచిని ప్రత్యేకంగా సిద్ధం చేసి వడ్డిస్తాయి. నేతితో సిద్ధమైన పురన్ పోలి, కుల్ఫీ, తండాయి వంటి వంటకాలు అదనపు ఆకర్షణగా ఉంటాయి.