Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
ABN , Publish Date - Sep 16 , 2024 | 07:38 AM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై కేసు నమోదయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందింది.
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డ్యాన్సర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు అని తెలిసింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేసినట్టు సమాచారం.
ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్‌లో తాను కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నానని యువతి వెల్లడించింది. చెన్నై, ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతో పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికా గోయల్‌ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ కోరారు. కాగా 2019 లో కూడా జానీ మాస్టర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది.