Share News

Telangana Talli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Dec 09 , 2024 | 06:09 PM

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కార్యక్రమానికి ఆహ్వానించినా..

Telangana Talli: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బిగ్ ట్విస్ట్..
CM revanth

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన హాజరుకాలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఎవరూ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదు. భారీ సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా ఫౌంటెయిన్ కూడా నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇదే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రచించిన కవి అందెశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను ప్రభుత్వం తరపున సత్కరించారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు కవులను సన్మానించారు. మరోవైపు ప్రతి ఏటా డిసెంబర్ ‌9న తెలంగా తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.


విగ్రహం ఎలా ఉందంటే..

20 అడుగులతో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో ఏర్పాటుచేశారు. ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీర, ముక్కుపుడక, గుండుపూసలు, హారం ఉన్నాయి. కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఎడమ చేతిలో వరి, జొన్నలు, సజ్జ పంటలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. కుడి చేతితో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు.


బీఆర్‌ఎస్ నిరసన..

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చి కొత్తగా మరో రూపాన్ని రూపొందించాల్సిన అవసరం ఏముందని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహంలా ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపించారు. ప్రభుత్వం విగ్రహాలు, గీతాలు మార్చే పనిపై కాకుండా తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు హితవు పలికారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 09 , 2024 | 06:56 PM