Share News

Hyderabad: సిద్ధిక్‌నగర్‌‌లో భవనం కూల్చివేత షురూ

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:55 AM

Telangana: గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్‌తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు.

Hyderabad: సిద్ధిక్‌నగర్‌‌లో భవనం కూల్చివేత షురూ
GHMC Officials Demolishing Collapsed Building At Hyderabad

హైదరాబాద్, నవంబర్ 20: నగరంలోని గచ్చిబౌలి సిద్ధిక్‌నగర్‌లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్‌తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు.


అయితే పక్కనే పెద్ద పెద్ద గుంతలు తీయడంతో ఈ భవనం గత రాత్రి ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పూర్తిగా డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి కూల్చివేతల ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో బహదూర్‌పూరా, జీడిమెట్లలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరగడంతో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.


మరోవైపు 50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్‌ఎంసీ సీరియస్ అయ్యింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారించారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు.


మాకు న్యాయం చేయండి: బిల్డింగ్ ఓనర్

కాగా.. బిల్డింగ్ ఒరిగిపోవడంపై భవన యజమాని స్వప్న మాట్లాడుతూ.. పక్కన కొత్త నిర్మాణం చేసేవాళ్ళు సరిగా పిల్లర్ గుంతలు తీయకపోవడంతో తమ బిల్డింగ్ కుంగిపోయిందన్నారు. అధికారులు మాత్రం తమ బిల్డింగ్ కూల్చుతామంటున్నారన్నారు. ‘‘మాకు న్యాయం చేసిన తర్వాత మా బిల్డింగ్ కూల్చాలి. ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టుకున్నాము. పక్కన కన్‌స్ట్రక్షన్ వాళ్ళు చేసే తప్పు వల్ల మా బిల్డింగ్ కూలుస్తున్నారు’’ అంటూ స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా.. గత రాత్రి హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని సిద్ధిక్‌నగర్‌లో ఐదు అంతస్తుల భవనం ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయింది. భవనాన్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే భవనంలో ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో వారంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఒరిగిన బిల్డింగ్ పక్కనే ఇంకో నిర్మాణం చేపట్టగా.. పెద్ద పెద్ద గుంతలు తీయడంతో భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని భవనాన్ని పరిశీలించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బిల్డింగ్‌లో ఉన్న వారిని హుటాహుటిన ఖాళీ చేయించేశారు. భవనం ఒరిగిన విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అలాగే పలువురు ఒరిగిన భవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది.


ఇవి కూడా చదవండి..

బాబోయ్ మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఉడుము పవర్ అంటే ఇదీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 12:22 PM