Share News

Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Dec 21 , 2024 | 08:09 PM

సంధ్యా థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవ్వరీ తప్పూ లేదని ఆయన చెప్పారు. సినిమా టీమ్ మంచి ఉద్దేశంతోనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చామని, కానీ అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు.

Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటన అనుకోకుండా జరిగిందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవ్వరీ తప్పూ లేదని ఆయన చెప్పారు. పుష్ప-2 టీమ్ మంచి ఉద్దేశంతోనే సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్లామని, కానీ అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఇది పూర్తిగా ఓ ప్రమాదమని, ఎవ్వరూ కావాలని చేసిందని కాదని అర్జున్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన బాధాకరమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, క్షమాపణ తెలియజేస్తున్నట్లు చెప్పారు. బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బన్నీ చెప్పుకొచ్చారు.


శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని అల్లు అర్జున్ తెలిపారు. థియేటర్ ఘటనలో తన క్యారెక్టర్‌ను కించపరిచారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వహననం జరిగిందని, కొందరి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించినట్లు బన్నీ చెప్పారు. పుష్ప-2 సినిమా హిట్టయినా తాను ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నట్లు తెలిపారు. తాను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదని, ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని అల్లు అర్జున్ వెల్లడించారు.


సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే తన జీవిత ఆశయమని, సినిమా థియేటర్లు తనకు దేవాలయంతో సమానమని అల్లు అర్జున్ చెప్పారు. అలాంటి ఆలయంలో ఒకరు ప్రాణాలు కోల్పోతే తన కంటే ఎక్కువ బాధపడే వారుండరని బన్నీ తెలిపారు. చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై గంటగంటకు సమాచారం తెలుసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఇప్పుడిప్పుడే కదులుతున్నట్లు వైద్యుల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఇంత బాధాకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం కాస్త ఊరట కలిగిస్తోందని ఐకాన్ స్టార్ చెప్పారు.


సంధ్యా థియేటర్ ఘటనలో తనపై తప్పుడు, అసత్య ప్రచారం జరుగుతోందని, అందుకే ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం, రాజకీయ నేతలు, ఏ ప్రభుత్వ శాఖపై తాను నిందలు వేయడం లేదని చెప్పారు. కానీ, తొక్కిసలాట జరిగినప్పుడు తాను తప్పుగా ప్రవర్తించానని అనేక ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందలు మోపే వారు చెప్పినట్లు తాను తప్పుగా ప్రవర్తించలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. వారు వేసిన నిందలు ఎంతో బాధించాయని అల్లు అర్జున్ తెలిపారు.


ఘటన జరిగినప్పట్నుంచీ అన్ని కార్యక్రమాలను ఆపేసుకుని 15 రోజులుగా ఇంట్లోనే బాధపడుతూ కూర్చున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. అలాంటిది ఆ రోజు తాను ఏదేదో మాట్లాడినట్లు ప్రచారం చేస్తుంటే చాలా బాధ కలుగుతోందని ఆయన చెప్పారు. కాళ్లు, చేతులు విరిగిపోతే పర్లేదని తాను చెప్పినట్లు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎదుట తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని బన్నీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా తాను ఉన్నప్పుడు ఘటన జరిగిందని కాబట్టి బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

Updated Date - Dec 21 , 2024 | 08:50 PM