Share News

Jani Master: జానీ మాస్టర్ పోస్ట్ ఊస్ట్.. సంచలన నిర్ణయానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ రెడీ

ABN , Publish Date - Sep 16 , 2024 | 05:40 PM

కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు..

Jani Master: జానీ మాస్టర్ పోస్ట్ ఊస్ట్.. సంచలన నిర్ణయానికి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ రెడీ
Jani Master

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కష్టాలు వీడటం లేదు. ఓ యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జనసేన పార్టీ జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్‌ అత్యవసర సమావేశం జరగనుంది. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో ఈరోజు (సోమవారం) జరగాల్సిన అసోసియేషన్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు.


సస్సెండ్ చేస్తారా..

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి యూనియన్‌లో ఎవరినైనా సస్పెండ్ చేయాలంటే సమావేశం ఏర్పాటుచేసి అందరి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్‌లో ఏవైనా పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు చర్యల విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినప్పుడే కొన్ని నిబంధనలు పెట్టుకోవడం జరుగుతుంది. దీనినే యూనియన్ బైలాస్ అంటారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరిస్తాయా.. లేదంటే ఆయన సభ్యత్వాన్ని రద్దుచేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సభ్యత్వం రద్దు చేస్తే ఆయన తన అధ్యక్ష పదవిని కోల్పోతారు. యూనియన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాలి.


కేసు ఇదే..

జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 16 , 2024 | 06:47 PM