BRS: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్
ABN , Publish Date - Mar 04 , 2024 | 06:01 PM
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) భారీ ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి నుంచి కొంత తెరుకొని గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా నేడు (సోమవారం) నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) ప్రకటించారు.
హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) భారీ ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి నుంచి కొంత తెరుకొని గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. ప్లాన్‌లో భాగంగా నేడు (సోమవారం) నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను ఖరారు చేశారు. తొలుత మానుకోటకు సంబంధించి పలు పేర్లను పరిశీలించారు. చివరకు కవిత పేరునే ఖరారు చేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కవిత పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థులను ప్రకటించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఎవరూ అధైర్యపడొద్దు: కేసీఆర్
‘‘కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెడతాం. త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. జిల్లాలో పార్టీ ఓడిపోయిందని ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీ వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్‌కు ఎలాంటి నష్టం లేదు. రాబోయే కాలం మనదే. నేతలు కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తాం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత మనకూ గెలుపు, ఓటములు వస్తాయి. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది. కాంగ్రెస్ వ్యతిరేకతను మనం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి