Minister Komatireddy: ఆ చిన్నారి కుటుంబానికి రూ.25 లక్షల చెక్కు అందించిన మంత్రి..
ABN , Publish Date - Dec 21 , 2024 | 07:59 PM
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆస్పత్రికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును శ్రీతేజ్ తండ్రికి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. "ఇకపై తెలంగాణలో బెన్‌ఫిట్ షోలు ఉండవు. అవేమైన దేశభక్తి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమాలా?. మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాల విషయం వేరు. పుష్ప-2 నేనూ చూశా. ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడను. మూడు గంటల సినిమా సమయంలో చాల పనులు చేసుకోవచ్చు. మేము కూడా క్షమాపణ చెప్తున్నాం. సినిమాలతో యువత చెడిపోతోంది. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్లు బయటకి వెళ్లొద్దు. షోలు చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగొద్దు. ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావొద్దు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. అందరూ హీరోలు, ప్రొడ్యూసర్స్ సహకరించాలని" చెప్పారు.
ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి మంత్రి కోమటిరెడ్డి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు మంత్రికి చెప్పారు. మెదడు, ఊపిరితిత్తులకు గాలి అందడం లేదని వెల్లడించారు. దీంతో శ్రీతేజ్‌కి ట్రైకస్టమీ చేసిన మంత్రికి వైద్యులు తెలిపారు.