Share News

Mobile Recovery: మీ ఫోన్ పోయిందా?.. రికవరీ అయిన మొబైల్స్‌లో ఒకటి మీదేనా?

ABN , Publish Date - Sep 05 , 2024 | 06:00 PM

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువజేసే మొత్తం 591 మొబైల్ ఫోన్లను పోలీసులు ఈ మధ్య రికవరీ చేశారు.

Mobile Recovery: మీ ఫోన్ పోయిందా?.. రికవరీ అయిన మొబైల్స్‌లో ఒకటి మీదేనా?

హైదరాబాద్: చోరీకి గురవ్వడం లేదా స్పృహలో లేనప్పుడు ఎక్కడైనా పడిపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు కానీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే కొందరికి మళ్లీ కొత్త ఫోన్ కొనుక్కునే ఆర్థిక స్థోమత ఉండదు. మరికొందరి వద్ద పుష్కలంగా డబ్బు ఉన్నప్పటికీ ఫోన్‌లో నిక్షిప్తమై ఉండే వ్యక్తిగత డేటా విషయంలో బాధపడుతుంటారు. కొందరు మధుర జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు విలువైన సమాచారాన్ని స్టోర్ చేసుకుంటారు. అందుకే సెల్‌ఫోన్ పోయినప్పటికీ తెగ బాధపడుతుంటారు. అయితే ఫోన్లు పోగొట్టుకున్న అందరికీ కాదు కానీ కొందరి ఫోన్లు తిరిగి ఇచ్చేందుకు రాచకొండ పోలీసులు సిద్ధమయ్యారు. చెబుతున్నారు. మొబైల్ ఫోన్లు పోతే తమ సమీప పోలీసు స్టేషన్‌లో లేదా నేరుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. దొంగలు ఫోన్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి, ఫోన్ల రికవరీకి ఈ విధంగా ఫిర్యాదు చేయడం అక్కరకొస్తుందని సూచిస్తున్నారు.


రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువజేసే మొత్తం 591 మొబైల్ ఫోన్లను పోలీసులు ఈ మధ్య రికవరీ చేశారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐటీ సెల్ కో-ఆర్డినేషన్‌తో సీసీఎస్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, బోనగిరి పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 591 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని రాంచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇందులో ఎల్‌బీ నగర్ సీసీఎస్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిర్ సీసీఎస్ పరిధిలో 103 మొబైల్స్, మల్కాజిగిరి సీసీఎస్ పరిధిలో 149 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని ఆయన తెలిపారు. వీటితో కలిపి ఈ సంవత్సరం ఇప్పటివరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3213 ఫోన్లు రికవరీ చేసినట్లు అయిందని సుధీర్ బాబు వివరించారు.


కాగా మొబైల్ ఫోన్లు పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు వెంటనే మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఆ నంబర్ ఆధారంగా సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తామని రాంచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.


సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి

సైబరాబాద్ పోలీసులు గతవారం 570 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ రూ.1.5 కోట్లు అని వెల్లడించారు. గత శుక్రవారం వీటిని యజమానులను గుర్తించి అప్పగించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొబైల్ ఫోన్లు వాడే వారిలో చదువుకున్నవారే ఎక్కువ మంది ఉన్నప్పటికీ.. దొంగతానికి గురైన ఫోన్లను ఎవరూ ఉపయోగించకుండా ఎలా నిరోధించాలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసునని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 06:00 PM