Share News

గనుల తవ్వకాలకు వార్షిక క్యాలండర్‌ను రూపొందించండి

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:59 AM

ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలండర్‌ను రూపొందించాలని, ఆ తర్వాతే గనుల టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో గనుల శాఖ రాబడులను ఆయన సమీక్షించారు. గనుల శాఖ ద్వారా ఆదాయాలను పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు.

గనుల తవ్వకాలకు వార్షిక క్యాలండర్‌ను రూపొందించండి

  • ఆ తర్వాతే టెండర్లు పిలవండి

  • ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు

  • అప్పగించడంపై సర్వే చేయండి

  • గనుల శాఖపై సమీక్షలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలండర్‌ను రూపొందించాలని, ఆ తర్వాతే గనుల టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గడిచిన రెండేళ్లలో గనుల శాఖ రాబడులను ఆయన సమీక్షించారు. గనుల శాఖ ద్వారా ఆదాయాలను పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. రాష్ట్రంలోని నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశమున్న రీచ్‌ల గుర్తింపు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈ అంశంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇదివరకు పలు గ్రానైట్‌ క్వారీలకు అపరాధ రుసుములు విధించి, వాటిని మూసేయించారని, ఆ ఫైన్‌ల సొమ్మును ఎంత వరకు వసూలు చేశారంటూ ఆరా తీశారు. ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయిస్తే ఆదాయం పెరుగుతుందో లేదో సమగ్ర సర్వే చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు అప్పగించడం వల్ల దళారులకు అడ్డుకట్ట వేసినట్లవుతుందన్నారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావాలని, అదే సందర్భంలో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా పట్టా భూముల పేరిట గోదావరి నదీ తీరం వెంట ఇష్టమొచ్చినట్లు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 12 , 2024 | 06:19 AM