TG News: ప్రాణంపోతోంది రక్షించండని వేడుకున్నా.. కనికరించని జనం
ABN , Publish Date - Nov 21 , 2024 | 11:13 AM
Telangana: కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాంపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు చెందిన ఎలందర్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా రివర్స్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీపై నుంచి ఎలందర్ కింద పడటంతో అతడి రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లింది. ప్రమాదంలో ఎలందర్ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
హైదరాబాద్, నవంబర్ 21: ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’’ అంటూ ఓ రచయిత రాసిన ఈ పాట అక్షరాలా నిజమయ్యేలా కొన్ని సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు అండగా ఉండాల్సింది పోయి కొందరు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. వారి ప్రాణాలు రక్షించడంలో సహాయం చేయకపోగా ఫోటోలు, వీడియోల పిచ్చితో మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు కొందరు.
Anitha: గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై హోంమంత్రి ఏం చెప్పారంటే
ప్రాణంపోతోంది కాపాడండి మహాప్రభో అన్నా కూడా జనం చూస్తూ ఉన్నారే ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. తాజాగా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగి ఓ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. తన ప్రాణాలు రక్షించాలని కోరుకున్నా.. చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉన్నారే తప్ప ముందుకు రాలేదు. పైగా తామేదో మంచి పనిచేస్తున్నట్లు బాధతో విలవిలలాడుతున్న బాధితుడి ఫోటోలు, వీడియోలు తీయడంలో బీజీ అయ్యారు. దీంతో చూస్తూ ఉండగానే అతడి ప్రాణం గాల్లో కలిసిపోయింది.
అసలేం జరిగిందంటే...
కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు చెందిన ఎలందర్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా రివర్స్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీపై నుంచి ఎలందర్ కింద పడటంతో అతడి రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లింది. ప్రమాదంలో ఎలందర్ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. రక్తపు మడుగులో ఎలందర్ నొప్పితో విలవిలలాడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి చుట్టుపక్కల జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు. ప్రాణంపోతోంది రక్షించండి అని వేడుకున్నా కూడా వీడియో, ఫోటోలు తీసుకుంటూ జనం.. అతడికి సహాయం చేయలేదు. దీంతో జనాల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.
నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని బాధితుడు వేడుకున్నాడు. అయినప్పటికీ జనం కనికరించకుండా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారు. 108 వెహికల్ వచ్చే వరకు కూడా జనం ఫోటోలు, వీడియోలతో కాలక్షేపం చేశారు. అంబులెన్స్ వచ్చి ఎలందర్‌ను ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదం జరిగి చాలా సేపు అవడంతో పాటు, సరైన సమయానికి ఆస్పత్రికి తరలించకపోవడంతో ఎలందర్ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ హృదయ విదారకర ఘటనను చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద బాధితుడిని పట్టించుకోకుండా వీడియోలు తీసిన జనంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు
Read Latest Telangana News And Telugu News