Share News

Telangana Police: పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:55 PM

పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సూచించారు.

Telangana Police: పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

హైదరాబాద్: సోషల్ మీడియాలో(Social Media) కొందరి విపరీత ధోరణి సమాజంలో ఇతరులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..! ఇందుకు యూట్యూబర్ హర్ష (మహాదేవ్) అనే యువకుడి ఘటనే ఉదాహరణ. ఫేమస్ కావడం కోసం డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతూ.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. వీడియో వైరల్ కావడం అటుంచితే.. హర్షనే వైరల్ అయిపోయాడు. హర్షను కూకట్‌పల్లి పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోనికి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు పోలీసులు సూచించారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖాకీలు హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. యూట్యూబర్ మహాదేవ్‌‌పై BNS 292,125తోపాటు పలు సెక్షన్ల కింద కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


పిచ్చి ముదిరితే కేసులే..!

సోషల్ మీడియాలో పాపులార్ కావడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో కొందరు పైత్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిగా రీల్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యూట్యూబర్ హర్ష కూడా పిచ్చి రీల్ ఒకటి చేసి రెచ్చిపోయాడు. కూకట్‌‌పల్లిలో డబ్బులను గాల్లోకి ఎగిరేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అక్కడున్న కొంతమంది డబ్బులను తీసుకోవడానికి ఎగబడ్డారు. ఒక్కసారిగా జనం పోగవడంతో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు.


ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అది కాస్త సైబరాబాద్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో రక్షక భటులే రంగంలోకి దిగారు. అతనిపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హర్ష ఒక్కడే కాదు. ఇలాంటి వారు హద్దులు దాటుతూ తమ పైత్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకుండా పోతోంది. ఇలాంటి వ్యక్తులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల వింత చేష్టలు కొంతమేర తగ్గుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 08:06 PM