Share News

IT Corridor: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Oct 14 , 2024 | 07:35 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్‌. వేలాది ఐటీ కంపెనీలు.. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

IT Corridor: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

  • • శరవేగంగా సాగుతున్న సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్ల పనులు

  • • 20 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ కమిషనరేట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఐటీ కారిడార్‌. వేలాది ఐటీ కంపెనీలు.. రోజుకు సుమారు 15–20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. అలాంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న, అత్యధికంగా వాహనాల రాకపోకలు సాగించే ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న రోడ్లను విస్తరించి, ప్రత్యేకంగా ఫ్రీ లెఫ్ట్‌ వెల్లడానికి సరిపడా రోడ్లను విస్తరిస్తున్నారు. గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్‌ వద్ద గచ్చిబౌలి పీఏఎస్‌ ఎంట్రెన్స్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌లో పార్కింగ్‌ స్థలాన్ని తొలగించి ఐఐటీ జంక్షన్‌ వరకు అతిపెద్ద రోడ్డుగా విస్తరిస్తున్నారు. దాంతో సైబరాబాద్‌ సీపీ కార్యాలయం, ఓఆర్‌ఆర్‌ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు వెళ్లేవారు ఐఐఐటీ జంక్షన్‌ వద్ద సిగ్నల్‌ కోసం ఆగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక రోడ్డును నిర్మిస్తున్నారు.


అంతేకాకుండా హెచ్‌సీయూ నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ఆగకుండా లెఫ్ట్‌వెళ్లేవారు, నేరుగా వెళ్లేవారు సిగ్నల్‌ కోసం ఆగకుండా, జంక్షన్‌ వద్ద వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లాలనుకునేవారు. ఐఐఐటీ వద్ద లెఫ్ట్‌ తీసుకొని, స్టేడియం వద్ద యూటర్న్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రాయదుర్గం నుంచి షేక్‌పేట ఫ్లైవోవర్‌ వరకు, ఐకియా నుంచి హైటెక్‌సిటీ వరకు అక్కడి నుంచి మాదాపూర్‌ యశోద ఆస్పత్రి వరకు సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌లు అందించడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. బయోడైవర్సిటీ వద్ద సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌ ఏర్పాటు చేసి ఎలా సక్సెస్‌ అయ్యారో ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద అదే పద్ధతి కొనసాగించడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. మరో 20 రోజుల్లో సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ఇప్పటికే హైరైజ్‌ కెమెరాల ఏర్పాటు..

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణ కు ఇప్పటికే హైరైజ్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎతైన ఐటీ కంపెనీల భవనాలకు హైరైజ్‌ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల చుట్టూ 360 డిగ్రీస్‌ రేడియస్‌లో ఒక్కో కెమెరా ఒక కిలోమీటర్‌ మేర స్పష్టమైన విజువల్స్‌తో వీక్షిస్తుంది. దాన్ని జూమ్‌చేసి చాలా స్పష్టంగా వాహనాల నంబర్‌లతో సహా.. చూడొచ్చు. దాంతో ఆ చట్టుపక్కల ఎక్కడ ఏ చిన్న ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు తెలిసేలా కెమెరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ (పీఎస్‌ ఐవోసీ)కి అనుసంధానం చేశారు.


అక్కడి నుంచి సిబ్బంది ట్రాఫిక్‌ను మానిటరింగ్‌ చేస్తారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ సైతం పరిస్థితిని సమీక్షించేలా ఆయన కార్యాలయానికి కనెక్ట్‌ చేశారు. దాంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కడ జామైంది..? ఎందుకు జామైంది..? ప్రస్తుత పరిస్థితిని వీక్షించి వెంటనే ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దింపి ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటు సైతం సత్ఫలితాలు ఇస్తాయని, ఎన్నాళ్లుగానో ఉన్న ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీరిపోతాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ ఉన్నతాఽధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

For Latest News and National News click here

Updated Date - Oct 14 , 2024 | 07:35 AM