Hyderabad: మరో విగ్రహం ధ్వంసం
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:42 AM
హైదరాబాద్‌లో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం
దుండగుణ్ని చితకబాదిన స్థానికులు
హిందూ సంఘాల ఆందోళన
మతోన్మాద శక్తుల కుట్రే: కిషన్‌రెడ్డి
ఆలయంపై దాడి దుర్మార్గం: సంజయ్
సికింద్రాబాద్, రెజిమెంటల్‌బజార్, హైదరాబాద్ సిటీ అక్టోబరు 14 (ఆంద్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పెద్ద శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు వెంటనే నిందితుణ్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం స్థానిక మార్కెట్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో నిందితుణ్ని వారికి అప్పగించారు. అతణ్ని ముంబైకి చెందిన సల్మాన్(30)గా గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం అతణ్ని ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు మాట్లాడే స్థితిలో లేకపోవడంతో నగరానికి ఎందుకు వచ్చాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఈ దుశ్చర్యకు ఒక్కడే పాల్పడ్డాడా, లేక మరికొందరు కూడా ఉన్నారా? అనే విషయాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అంతకుముందు, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం సమాచారం తెలియగానే నగర పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉత్తర మండలంతో పాటు ఇతర జోన్ల నుంచి భారీగా పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోపు స్థానిక ప్రజలు, భజరంగ్‌దళ్ తదితర హిందూ ధార్మిక సంఘాల నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆలయం వద్దకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేవాలయం వద్దకు చేరుకున్న బీజేపీ నాయకురాలు మాధవీలత కొద్దిసేపు అక్కడ ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారుల్ని బొల్లారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
కొంతసేపటికి అక్కడకు చేరుకున్న నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాజీ మంత్రి తలసాని తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు మతోన్మాద శక్తుల పనేనని ఆరోపించారు. దర్యాప్తు చేపట్టి దీని వెనుక ఉన్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ గుడిపై దుండుగులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఈ దేవాలయంపై పిచ్చోళ్లు దాడులు చేశారని పోలీసులు చెప్తున్నారని, మరీ ఆ పిచ్చోళ్లు హిందూ దేవాలయాల మీదనే ఎందుకు దాడి చేస్తున్నారని? ప్రశ్నించారు.
ఇలాంటి దాడులు ఇతర మతాలకు సంబందించిన ఆలయాలపై జరిగితే పరిస్థితి ఇలాగే ఉండేదా? అని మండిపడ్డారు. దాడులు జరిగితే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తాము వాస్తవాలు మాట్లాడితే బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని మల్లికార్జున ఖర్గే అనడం సిగ్గు చేటన్నారు. ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్‌లో ఇలాంటి ఘటనల వల్ల మత విద్వేషాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి తలసాని ఆందోళన వ్యక్తంచేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తన సొంత నిధులతో విగ్రహాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. దాడిని ఎంపీలు ఈటల, లక్ష్మణ్ ఖండించారు. ఆలయ ఘటనపై ఎంఐఎం పార్టీ స్పందించింది. దోషులు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మొయినుద్దీన్ డిమాండ్ చేశారు.