Share News

Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:24 AM

తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా.. ఇవాళ, రేపు రెండురోజులపాటు..

Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ముసురు అలుముకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా.. ఇవాళ, రేపు రెండురోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా (IMD) వేసింది. రాత్రి కురిసిన వర్షం ఇవాళ ఉదయానికీ వదలకపోవడంతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.


ఆరెంజ్ అలర్ట్..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో శని, ఆదివారాలకుగానూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ, మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్... ఆదివారం ఉమ్మడి ఖమ్మంలో.. అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సెప్టెంబరు 2, 3 తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో నగరంతో పాటు పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. బోనకల్లులో అత్యధికంగా 6.92 సెంమీ, మధిరలో 3.44 మీ పాతం నమోదైంది.

జగిత్యాల జిల్లా మేడిపల్లి 8.6, జగిత్యాలలో 8.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ జయశకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. నిజామాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, జనగామ, యాదాద్రి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.


లోతట్టు ప్రాంతాలు జలమయం..

వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్‌పల్లి, లింగంపల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, నాంపల్లి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్‌నగర్, హయత్ నగర్, లక్డీకపూల్, కోఠి, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, వనస్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది.

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అక్టోబర్‌లోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

For Latest News click here

Updated Date - Aug 31 , 2024 | 08:39 AM