Srinivas Goud: నోటిస్ ఇవ్వకుండా.. ఇళ్లు కూల్చమని చట్టంలో ఎక్కడైనా ఉందా
ABN , Publish Date - Aug 30 , 2024 | 12:53 PM
తనకు శత్రువులు ఎవరూ లేరని.. తనపై ఎవరు కుట్ర చేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేశారన్నారు.
హైదరాబాద్: తనకు శత్రువులు ఎవరూ లేరని.. తనపై ఎవరు కుట్ర చేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేశారన్నారు. అంధులు వేడుకున్నా కూడా పోలీసులు వారిని వదలలేదన్నారు. తమ సామాగ్రిని తీసుకుంటామని బ్రతిమిలాడినా సమయం ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చిందన్నారు. నాలుగేళ్ల పాటు పెన్షన్ డబ్బులతో చిట్టీలు వేసుకొని ఇల్లు నిర్మించుకున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పట్టాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
అంధుల కాలనీలో చెరువు కానీ.. కుంట కానీ లేదని.. అది కోట్లు విలువ చేసే భూమి కూడా కాదన్నారు. అయినా కూడా అంధుల ఇళ్లను కూల్చేశారన్నారు. బడాబాబులకు 30 రోజుల సంజాయిషి నోటిస్‌లు ఇస్తున్నారని అంధులకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారిని ఒక లాగా.. ధనవంతులను మరోలా చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నోటిస్ ఇవ్వకుండా.. ఇళ్లు కూల్చమని చట్టంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నది.. బలహీన వర్గాలపై దాడుల కోసమా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టిందో తెలియదు కానీ.. పేదలు కట్టుకున్న ఇండ్లను మాత్రం కూల్చివేస్తోందని అన్నారు. అన్ని పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఎక్కడైతే అంధుల ఇళ్లను కూల్చేసిందో అక్కడే వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు దీనిని సుమోటోగా స్వీకరించి.. విచారణ జరపాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తాను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాచారాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై కుట్ర కేసు విషయంలో తాను మాట్లాడింది ఒకటైతే.. మరొకటి ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై కుట్ర ఘటనలో తాను ఫిర్యాదు దారుడిని కాదన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఏం సమాచారం ఆనాడు ఉందో కానీ కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటి వరకూ పోలీసులు సాక్షిగా కానీ.. ఫిర్యాదు దారిగా కానీ తనను పేర్కొన లేదన్నారు. ఆనాటి కేసులో పోలీసులు కనీసం తన వాగ్మూలాన్ని సైతం రికార్డ్ చేయలేదన్నారు. తనపై కుట్ర జరిగే ప్రమాదం ఉందని అప్పట్లో హెచ్చరించింది పోలీస్ వారేనన్నారు. అసలు తనకు శత్రువులు ఎవరూ లేరని అలాంటిది తనపై ఎవరు కుట్ర చేస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.