Share News

Jagga Reddy: మాటలు మొరటైనా.. నేను, సీఎం రేవంత్‌ మంచోళ్లం

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:34 AM

‘‘మా మాటలు మొరటైనా నేను, సీఎం రేవంత్‌రెడ్డి మంచోళ్లం. కేటీఆర్‌.. నీ సోషల్‌ మీడియాను అదుపులో పెట్టుకో. నీకు కొంచెం గౌరవం ఇస్త. కాదని మాపై తప్పుడు రాతలు రాయిస్తే..

Jagga Reddy: మాటలు మొరటైనా.. నేను, సీఎం రేవంత్‌  మంచోళ్లం

  • కేటీఆర్‌, హరీశ్‌రావులు డబుల్‌ లుచ్చాలు

  • బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రెచ్చగొడుతోంది.. దాని కోరలు పీకేస్తం

  • మాపై తప్పుడు రాతలు రాస్తే.. ఖైరతాబాద్‌లో ముక్కు నేలకు రాయిస్త

  • రేవంత్‌ చిట్టి నాయుడు కాదు.. గట్టి రెడ్డి

  • ఆయన్ని బీఆర్‌ఎస్‌ నేతలు పది నెలలకే భరించలేకపోతున్నరు

  • ఇంకా నాలుగేళ్లు భరించాలి.. ఆ తర్వాత ఐదేళ్లూ అధికారం మాదే: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘మా మాటలు మొరటైనా నేను, సీఎం రేవంత్‌రెడ్డి మంచోళ్లం. కేటీఆర్‌.. నీ సోషల్‌ మీడియాను అదుపులో పెట్టుకో. నీకు కొంచెం గౌరవం ఇస్త. కాదని మాపై తప్పుడు రాతలు రాయిస్తే.. రాసినవాడిని ఖైరతాబాద్‌ సెంటర్‌కు తీసుకువచ్చి పీజేఆర్‌ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయిస్తా. నిన్ను, హరీశ్‌రావును నడి బజారులో నిలదీస్తం’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ వాళ్లను లుచ్చాలంటూ మాట్లాడుతున్న కేటీఆర్‌, హరీశ్‌రావులే డబుల్‌ లుచ్చాలని దుయ్యబట్టారు. అధికారం పోయేసరికి వారికి పిచ్చిపట్టినట్టుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని ఎప్పుడు బద్నాం చేద్దామా? నాలుగేళ్లు ఎప్పుడు గడుస్తాయా? అని ఎదురు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని.. తమపై బుస కొట్టి రెచ్చగొడుతున్న దాని కోరలను పీకేస్తామని హెచ్చరించారు. గాంధీభవన్‌లో శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒకరిద్దరు కలెక్టర్లకు పదిసార్లు ఫోన్లు చేసినా ఎత్తలేదని, దాంతో వారిని తిట్టానని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడున్న మహిళా కలెక్టర్‌ను తాను తిట్టినట్లుగా బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అనని మాటలను అన్నట్లుగా పోస్టులు పెడితే మాకు కోపం రాదా? కోపం వచ్చి నేను హరీశ్‌, కేటీఆర్‌ను తిట్టనా? అందుకే బేవకూఫ్‌ కథలు చేయవద్దని చెబుతున్న. పోస్టు పెట్టిన వాడు దొరికితే ఖైరతాబాద్‌లో బట్టలూడదీసి కొట్టేవాడిని’ అని జగ్గారెడ్డి అన్నారు.


పోస్టు పెట్టినవాడి ఫొటో బయట పెడుతున్నానని, వాడు ఎక్కడున్నా.. తీసుకురావాలని కాంగ్రెస్‌ కార్యకర్తలను కోరారు. అమెరికా, లండన్‌, దుబాయిలో ఉండి.. కేటీఆర్‌ ఫొటోలు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తమను ట్రోల్‌ చేస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎన్నారైలు వారిని ఇండియాకు ఎత్తుకురావాలని, విమానం చార్జీలు పెట్టుకుంటానని అన్నారు. ‘సీఎం రేవంత్‌, జగ్గారెడ్డి, మంత్రులు ఎట్లా కనపడుతున్నరు వాళ్లకు? మాతో కుస్తీ పట్టలేరు. కొట్లాడలేరు. రాజకీయం ఎట్లా చేయాలో తెలియదా? అది చేతకాక.. సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నరు’ అని మండిపడ్డారు.


  • నేను.. రేవంత్‌ ఫైటర్స్‌!

సీఎం రేవంత్‌రెడ్డి.. చిట్టినాయుడు కాదు గట్టి రెడ్డి అని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్‌ తొడ కొడితే కేటీఆర్‌కు కాళ్లు వణుకుతాయన్నారు. ఉద్యమం ముసుగులో నాడు ఆంధ్రావాళ్ల పేరు పెట్టి తిట్టారు కానీ.. కేటీఆర్‌, హరీశ్‌కు తిట్టే ధైర్యం కూడా లేదన్నారు. ‘‘నేను, సీఎం రేవంత్‌ ఫైటర్లం. ధైర్యంలో కేటీఆర్‌, హరీ్‌శ మాతో పోటీ పడలేరు. వారిలాగా ఆంధ్రోళ్ల పేరు అడ్డం పెట్టుకుని తిట్టం. కేటీఆర్‌, హరీశ్‌ పిల్లచేష్టలు మానుకుంటే మంచిది’’ అని హితవు పలికారు. సీఎం రేవంత్‌ః పని మొదలుపెట్టి పది నెలలే అయినా బీఆర్‌ఎస్‌ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని, ఇంకా నాలుగేళ్లు వాళ్లు భరించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఐదేళ్లూ తామే అధికారంలో ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నమని చెప్పారు.

Updated Date - Oct 27 , 2024 | 03:34 AM