Share News

ఇక్కడ కేసీఆర్‌.. అక్కడ మోదీ!

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:24 AM

‘గత ముఖ్యమంత్రి (కేసీఆర్‌) తెలంగాణలో వేలాది మంది ఫోన్లను ట్యాప్‌ చేయించారు. నిఘా సంస్థలు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్‌ చేసి, ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేసి, పరికరాలను నదిలో పడేశారు. రాష్ట్రంలో పలు వర్గాలను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా వసూళ్లు చేశారు. కొత్త ప్రభుత్వం ట్యాపింగ్‌పై

ఇక్కడ కేసీఆర్‌..  అక్కడ మోదీ!

స్కాంలు.. బలవంతపు వసూళ్లు.. ట్యాపింగ్‌లు

పైసలు ఇచ్చుకోండి.. దందా చేసుకోండి నినాదం

ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం ఎలక్టోరల్‌ బాండ్లు

తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను మట్టికరిపించాం

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనీ ఓడిస్తాం.. గెలుపు మాదే

మ్యానిఫెస్టో విప్లవాత్మకం.. దేశ ముఖచిత్రం మారిపోతుంది

చిన్న పిల్లాడు పిలిచినా తక్షణం తెలంగాణలో వాలిపోతా

ఇక్కడి ప్రజలతో నాది కుటుంబ, ఆత్మీయ బంధం

జీవితాంతం మీ వెంటే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

తుక్కుగూడ జనజాతర సభలో పార్టీ మ్యానిఫెస్టో విడుదల

మేడిన్‌ చైనాను మేడిన్‌ తెలంగాణ వెనక్కినెట్టాలని ఆకాంక్ష

జన జాతరా..!? జన సంద్రమా..!? సభలో.. బయటా.. ఎక్కడ చూసినా జనమే! సభా ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో రోడ్లపైనా జనమే! మండే ఎండలను కూడా లెక్క చేయకుండా తుక్కుగూడకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటెత్తారు! అగ్ర నేత రాహుల్‌ గాంధీ హాజరైన జన జాతర సభకు లక్షలాదిగా హాజరయ్యారు. తుక్కుగూడ కాంగ్రెస్‌ సభలో అంచనాలకు మించి హాజరైన జన సందోహంలో ఓ భాగమిది!!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ముఖ్యమంత్రి (కేసీఆర్‌) తెలంగాణలో వేలాది మంది ఫోన్లను ట్యాప్‌ చేయించారు. నిఘా సంస్థలు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. వేలాది ఫోన్లు ట్యాప్‌ చేసి, ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేసి, పరికరాలను నదిలో పడేశారు. రాష్ట్రంలో పలు వర్గాలను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా వసూళ్లు చేశారు. కొత్త ప్రభుత్వం ట్యాపింగ్‌పై విచారణ ప్రారంభించడంతో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్‌ తరహాలోనే.. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను ఎక్స్‌టార్షన్‌ డైరెక్టరేట్‌ (బలవంతపు వసూళ్ల డైరెక్టరేట్‌)గా మార్చేసింది’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ బీ-టీమ్‌ (బీఆర్‌ఎ్‌స)ను ఓడించామని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏనాటికైనా మేడిన్‌ చైనాను మేడిన్‌ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా తక్షణం వాలిపోతానని భరోసా ఇచ్చారు. తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జన జాతర సభకు రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో (గ్యారంటీ కార్డు)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళలు, యువత, రైతులు తదితర వర్గాలకు అమలు చేయనున్న పథకాలను వివరించారు. కేంద్రంలో మోదీ పాలనను.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును దునుమాడారు.

‘‘ప్రపంచంలోనే అతి పెద్ద వాషింగ్‌ మెషీన్‌ను బీజేపీ నడుపుతోంది. దేశంలోని అత్యధిక అవినీతిపరులు ఇప్పుడు మోదీ వెంటే ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కుంభకోణం ఎలక్టోరల్‌ బాండ్లు. ‘పైసలు ఇచ్చుకోండి.. దందాలు చేసుకోండి’ అన్నది దాని నినాదం. వ్యాపారులందరినీ దానిని అడ్డు పెట్టి బెదిరించారు. ఎలక్టోరల్‌ బాండ్ల జాబితాను చూస్తే.. వాళ్ల వ్యాపారాలన్నీ బయటపడతాయి. సీబీఐ ఓ సంస్థపై దాడులు చేస్తుంది. అదే సంస్థ ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు బీజేపీకి ఇస్తుంది. ఆ తర్వాత సదరు సంస్థకే వేలాది కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్‌ దక్కుతుంది’’ అని ఆరోపించారు. మీడి యా, ధన బలం, నిఘా సంస్థలు, ఇంటెలిజెన్స్‌, ఈడీ, సీబీఐ మోదీ వెంట ఉన్నాయని, తమ వెంట వాస్తవాలు, ప్రజల ప్రేమ ఉందని, అంతిమంగా విజయం న్యాయానిదే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తన మనుషులను పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బ్యాంకు అకౌంట్లను మూసివేశారని, అయినా తాము భయపడబోమని స్పష్టం చేశారు. ‘‘దేశంలోని ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం రక్షణ ఇస్తుంది. ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ అనుకుంటోంది. మేం దీనిని అడ్డుకుంటాం. మేము చేస్తున్నది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే పోరాటం’’ స్పష్టం చేశారు.

1rahul0344A.jpg

యువతకు ఏడాదిపాటు లక్ష జీతం

అత్యధిక నిరుద్యోగం భారతదేశంలో ఉన్న సమయంలోనే తెలంగాణలో తమ ప్రభుత్వం కొలువుదీరగానే 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని, రానున్న కొద్ది రోజుల్లో మరో 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. ‘‘తెలంగాణలో మాట ఇచ్చినట్లే.. జాతీయ స్థాయిలో ఈ మేనిఫెస్టోతో అదే గ్యారంటీ ఇస్తున్నాం. ఈ మేనిఫెస్టో దేశ ప్రజల గొంతుక. లక్షలాదిమంది అభిప్రాయాలు తీసుకుని దీనిని రూపొందించాం. ఐదు గ్యారంటీలతో మేనిఫెస్టో ఉంది. దేశంలో నిరుద్యోగులందరికీ ఏడాదిపాటు లక్ష రూపాయల జీతం వచ్చేలా అప్రెంటిస్‌ శిక్షణ కోసం అప్రెంటిస్‌ చట్టాన్ని తేనున్నాం. ఉపాధి హామీ పథకంలో ఉపాధికి గ్యారంటీ ఇచ్చినట్లుగానే ఈ చట్టంతో దేశంలోని ప్రతి యువకుడికి నెలకు రూ.8,500 ఉపకార వేతనంతో ఏడాదిపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంతోపాటు వైద్య, విద్య రంగంలో శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు. మహిళలు, యువకులు, రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీని వివరించిన రాహుల్‌ గాంధీ.. అన్ని వర్గాలకూ మరో ఐదు హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయని, పేదలు, మహిళలు, రైతులు, కూలీల జీవితాల్లో ఇది వెలుగులు నింపుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ హామీలు ఇవ్వడమే కాదు. అమలు చేసి చూపుతుందంటూ తెలంగాణ సర్కారును ఉదాహరించారు. పార్టీ మేనిఫెస్టోను విప్లవాత్మకంగా రాహుల్‌ అభివర్ణించారు. దాని అమలుతో దేశ ముఖ చిత్రమే మారిపోతుందని అభిప్రాయపడ్డారు. నారీ న్యాయ్‌ చట్టాన్ని తీసుకురానున్నామని, దీని కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. మత్స్యకారుల కోసం డీజిల్‌ సబ్సిడీతోపాటు సహకార బ్యాంకును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దేశవ్యాప్తంగా కుల, ఆర్థిక గణన

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తరహాలోనే కుల గణన చేపడతామని రాహుల్‌ ప్రకటించారు. కుల గణన తర్వాత ఆర్థిక గణన చేస్తామని వెల్లడించారు. దేశంలో ఆర్థికపరమైన సర్వే చేసి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉందో తేలుస్తామన్నారు. చరిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు అందిస్తామని, అన్ని సంస్థల్లో వారి వాటాను వారికి ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘దేశ జనాభాలో 50 శాతం బీసీలు. 15 శాతం దళితులు. 8 శాతం ఆదివాసీలు. 15 శాతం మైనారిటీలు. 5 శాతం అగ్ర కుల పేదలు ఉన్నారు. వీరంతా కలిసి 90 శాతం. కానీ, దేశంలోని టాప్‌-200 కంపెనీ యజమానులుగా, మీడియా అధినేతలుగా ఈ వర్గాల్లో ఎవరూ లేరు. కేంద్ర ప్రభుత్వాన్ని 90 మంది ఐఏఎస్‌ అధికారులు నడుపుతుంటే.. ఈ వర్గాలకు చెందిన వారు ఏడుగురే. బడ్జెట్లో విడుదల చేస్తున్న ప్రతి వంద రూపాయల్లో ఈ వర్గాలకు ఇచ్చేది ఆరు రూపాయలే. దేశ నిర్ణయాధికారంలో వీరి పాత్ర లేదు. అందుకే, వీరి వాటా తేల్చడానికి కుల, ఆర్థిక గణన చేస్తాం’’ అని రాహుల్‌ వెల్లడించారు.

రుణ మాఫీ చేస్తాం

కిసాన్‌ న్యాయ్‌ కింద రుణమాఫీ చేస్తామని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర లభించేలా చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌ ప్రకటించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామన్నారు. ‘‘దేశంలో ప్రతి రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సంపన్నులకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను ప్రధాని మోదీ మాఫీ చేశారు. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’’ అని తప్పుబట్టారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని, ఉపాధి హామీతోపాటు రోజు కూలీ రూ.400 దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారు.

గ్యారంటీలివ్వడమే కాదు... పూర్తి చేసి తీరతాం

‘‘తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు ఇవ్వడమే కాదు. పూర్తి చేసి తీరుతుంది. సిలిండర్‌ను రూ.500కు ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల దాకా విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం. గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాం. వీటన్నిటినీ ఆరోజు (గతంలో తుక్కుగూడ లో) హామీ ఇచ్చాను’’ అని గుర్తు చేశారు.

పిలిస్తే పలుకుతా.. జీవితాంతం మీ వెంటే..

తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా తక్షణమే వాలిపోతానని, ఇక్కడి ప్రజలతో తనది రాజకీయాలకు అతీతమైన బంధమని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ‘‘నేనిక్కడ రాజకీయ ప్రసంగం చేశాను. కానీ, మీకు, నాకు మధ్య ఉన్నది రాజకీయాలకు అతీతమైన బంధం. కుటుంబ, ఆత్మీయ బంధం. సోనియా గాంధీ మీకు మద్దతు (రాష్ట్రాన్ని) ఇచ్చారు. ఢిల్లీలో నేను కూడా మీ వెంటే ఉంటా. మీ ప్రతినిధిగా స్పందిస్తా. మీరు పిలిస్తే మీ ముందు హాజరవుతా. జీవితాంతం మీ వెంటే ఉంటా’’ అని తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. మీ కలలను సాకారం చేయడానికి కొత్త రాష్ట్రం ఇస్తే.. ఆ కలను కేసీఆర్‌ ఛిద్రం చేశారని ధ్వజమెత్తారు. దేశానికి మార్గదర్శిలా తెలంగాణ ఉండాలని ఆకాంక్షించారు. ‘మేడిన్‌ చైనా’ను ఏదో ఒక రోజు ‘మేడిన్‌ తెలంగాణ’ వెనక్కి నెట్టాలని కోరుకున్నారు. ఉత్పాదక రంగంలో మేడిన్‌ తెలంగాణ అని నిరూపిస్తే.. యూపీలో కూడా మేడిన్‌ యూపీ, మేడిన్‌ రాజస్థాన్‌ అవుతుందన్నారు. ఇందుకు తాను, మీ ముఖ్యమంత్రి అంతా కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఒక మతంతో మరో మతానికి కొట్లాట పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో లక్షలాది మంది విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణాలు తెరిచారని, ఇక్కడి ప్రజలిచ్చే సందేశం దేశమంతా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు.

2RAHULSABHA-(2).jpg

సభ ఏర్పాట్లు బాగున్నాయి

రేవంత్‌కు రాహుల్‌ అభినందన

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్‌)

కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జనజాతర సభకు భారీగా జనం హాజరు కావడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తుక్కుగూడలో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం సభ ఏర్పాట్లను చూసి అబ్బురపడ్డారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పైకి వచ్చి జనాలకు అభివాదం చేశారు. అనంతరం వేదికపై ఆశీనులు కాగానే సభ ఏర్పాట్లు బాగున్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. జనసమీకరణ కూడా బాగా చేశారంటూ కితాబునిచ్చారు. కాగా, సభ ముగిసిన అనంతరం రాత్రి 8.28 గంటలకు రాహుల్‌గాంధీ వెంట సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చి వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి నోవాటెల్‌ హోటల్‌కు చేరుకొని కొద్దిసేపటి తరువాత నగరానికి బయలుదేరి వెళ్లారు.

బీజేపీకి ఎందుకు అవకాశమివ్వాలి?

బీజేపీకి మరోసారి అవకాశం ఎందుకివ్వాలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెప్పాలని రేవంత్‌ అన్నారు. ‘‘ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి.. పదేళ్లలో 7.21 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినందుకు మోదీకి ఓటేయాలా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి వారిని చంపినందుకు ఓటు వేయాలా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్క చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఇప్పటిదాకా మతాలు, ప్రాంతాలు, పార్టీల మధ్య చిచ్చు పెట్టి విభజించడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకున్న మోదీ.. ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నమో అంటే అర్థం.. నమ్మితే మోసం చేయడమని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టినట్లుగానే.. విభజన హామీలు అమలు చేయని, ఏడు మండలాలను ఏపీకి తాకట్టు పెట్టిన బీజేపీనీ బొంద పెట్టే వరకూ నిద్ర పోవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ పరివార్‌కు, గాంధీ పరివార్‌కు మధ్య పోరాటం జరుగుతుందని రేవంత్‌ చెప్పారు. మోదీ పరివార్‌లో ఈవీఎంలు, ఈడీ, సీబీఐ వగైరా ఉంటే.. గాంధీ పరివార్‌లో ఇందిర, రాజీవ్‌, సోనియా, రాహుల్‌, ప్రియాంక ఉన్నారని అన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

తుక్కుగూడ సభకు హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు

రాహల్‌ సమక్షంలో పార్టీలో చేరిక

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌. భద్రాచలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు శనివారం కాంగ్రె్‌సలో చేరారు. తుక్కుగూడ జనజాతర సభకు హాజరైన వెంకట్‌రావు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరితో సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 07 , 2024 | 04:24 AM