Six Guarantees: ఆరు గ్యారెంటీల దరఖాస్తు కోసం 6వ తేదీ లాస్ట్..గడువు పెంపు?
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:35 PM
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా..వీటి అమలు కోసం ప్రజల నుంచి డిసెంబర్ 28 నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో దరఖాస్తు గడువు పెంపు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను(six guarantees) అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఆయా పథకాల అమలు కోసం ప్రజల నుంచి డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో జరిగే గ్రామసభలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ అప్లికేషన్ల స్వీకరణ కోసం కొన్ని రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల పలువురు ప్రజలు తాము ఇంకా అప్లై చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో దరఖాస్తు గడువు పెంచాలని ప్రజలు(People) కోరుతున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామ సభల దగ్గరకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. అనేక మంది తెల్లవారు జాము నుంచే గ్రామ సభల ప్రాంతాల వద్దకు చేరుకుని లైన్లలో పోటీ పడి అప్లికేషన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఈ పథకాల కోసం స్వీకరించే దరఖాస్తు నాలుగు పేజీలు ఉండగా.. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ నిధి మినహా 5 హామీల కోసం దరఖాస్తు ఉంది. ఒక్కో పథకానికి విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఏదైనా పథకానికి అర్హులైన వారు దరఖాస్తు ఫారంలో ఆ పథకానికి అవసరమైన వివరాలను మాత్రమే నింపాలని అధికారులు(officers) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు అన్ని స్కీమ్‌లకు అర్హులైనట్లయితే ఒక్క అప్లికేషన్‌లో సంబంధిత వివరాలను పూర్తి చేస్తే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో దరఖాస్తు ఫారంతోపాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫొటో కాపీలు అందజేయాలని పేర్కొన్నారు.