Share News

ఎస్టీ కమిషన్‌ ముందుకు జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:01 AM

మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భూమి, నిధుల కేటాయింపులో వివక్షకు సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్‌ ఇటీవల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కమిషన్‌ కార్యాలయంలో జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ సోమవారం విచారణకు హాజరయ్యారు.

ఎస్టీ కమిషన్‌ ముందుకు జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌

  • మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ కాలేజీకి నిధుల కేటాయింపులో వివక్షపై ప్రశ్నించిన కమిషన్‌!

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భూమి, నిధుల కేటాయింపులో వివక్షకు సంబంధించి జాతీయ ఎస్టీ కమిషన్‌ ఇటీవల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని కమిషన్‌ కార్యాలయంలో జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ సోమవారం విచారణకు హాజరయ్యారు. మహబూబాబాద్‌ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమి, నిధుల కేటాయింపులో వర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ఎస్టీ కమిషన్‌కు ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ రిజిస్ట్రార్‌తోపాటు ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్స్‌లర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్‌ ఇటీవల సమన్లు జారీచేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం తరఫున, జేఎన్‌టీయూ తరఫున ప్రతినిధిగా రిజిస్ట్రార్‌.. ఎస్టీ కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.


కళాశాలకు కేటాయించిన స్థలానికి రక్షణగా ఫెన్సింగ్‌ వేయడానికి జేఎన్‌టీయూ నుంచి రూ.30లక్షలు విడుదల చేయకపోవడం వల్లనే 15 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఈ క్రమంలో పోలీసులు, జిల్లా యంత్రాంగానికి ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్‌ తప్పుపట్టినట్లు సమాచారం. కాగా, రూ.5 లక్షలకు మించి నిధుల విడుదలకు పాలకమండలి అనుమతి కావాల్సి ఉండగా, ప్రస్తుతం జేఎన్‌టీయూకు పాలకమండలి లేనందునే రూ.30లక్షలు విడుదల చేయలేకపోయినట్లు వర్సిటీ ఉన్నతాధికారులు ఎస్టీ కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలకమండలి ఏర్పాటు కాగానే నిధులు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 04:01 AM