Justice L. Narsimha Reddy : విచారణకు రండి!
ABN , Publish Date - Jun 26 , 2024 | 04:58 AM
విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై మీరు లిఖితపూర్వకంగా పంపించిన వాదనలకు, వాటిని ఖండిస్తూ వివిధ వర్గాలు సమర్పించిన పత్రాలకు పొంతన లేదని, తమ ఎదుట హాజరై వాస్తవాలను వివరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.
కేసీఆర్‌కు జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి కమిషన్ నోటీసులు
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభాకర్ రావులకు కూడా వారంలోపు వచ్చి వాస్తవాలను వివరించాలంటూ శ్రీముఖం
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై మీరు లిఖితపూర్వకంగా పంపించిన వాదనలకు, వాటిని ఖండిస్తూ వివిధ వర్గాలు సమర్పించిన పత్రాలకు పొంతన లేదని, తమ ఎదుట హాజరై వాస్తవాలను వివరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తోపాటు విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు కూడా కమిషన్ ఈనెల 19న నోటీసులు పంపింది. అవి ఈనెల 21న కేసీఆర్‌కు చేరినట్లు సమాచారం. నోటీసులు అందిన వారం రోజుల్లో (అంటే.. 21న నోటీసులు చేరితే.. ఈనెల 28వ తేదీలోపు) వాస్తవాలను తమకు వివరించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, పోటీ బిడ్డింగ్ లేకుండా యాదాద్రి ప్లాంట్ నిర్మాణం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని ఆరోపిస్తూ వాటిపై విచారణకు జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌ను రేవంత్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ‘రికార్డులన్నీ పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది’ అంటూ కమిషన్ ఇప్పటికే కేసీఆర్‌కు నోటీసులు పంపింది. దీనికి కేసీఆర్ ఘాటుగా జవాబు ఇచ్చారు కూడా. మీ కమిషన్‌కే విచారణార్హత లేదని, విచారణ బాధ్యత నుంచి తప్పుకోవాలంటూ జస్టిస్ నర్సింహా రెడ్డికే తేల్చి చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటూ ఆ లేఖలో వివరణ ఇచ్చారు. ఆ తర్వాత దీనిపై కమిషన్ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది. తాజాగా కేసీఆర్‌తోపాటు జగదీశ్ రెడ్డి, ప్రభాకర్ రావుకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే, విద్యుత్తు కమిషన్ విచారణను నిలుపు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవుతారా!? లేదా!? అనే ఉత్కంఠ నెలకొంది.